Etela Rajender: నేను బానిసను కాదు

5 Jun, 2021 04:15 IST|Sakshi

ఉద్యమ సహచరుడ్ని.. అది ప్రగతి భవన్‌ కాదు.. బానిసల భవన్‌: ఈటల

టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఐదేళ్లుగా అభిప్రాయ భేదాలు

అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా అనేకమార్లు అవమానించారు

నా వివరణ కోరకుండానే కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేశారు

‘ఈటలను బొంద పెట్టు’ అని ఆదేశాలిచ్చారు

ఆస్తులు అమ్ముకున్నా ఆత్మగౌరవ పోరాటాన్ని ఆపేది లేదు

టీఆర్‌ఎస్‌.. లాలూ, జయలలిత పెట్టిన పార్టీల్లాంటిది కాదు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో తనకు ఐదేళ్లుగా అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా అనేకమార్లు అవమానాలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బానిసను కాదని, ఉద్యమ సహచరుడినని పేర్కొన్నారు. ‘అనేక సందర్భాల్లో అనేక విషయాలు చెప్పే ప్రయత్నం చేశా. మంచిని కోరే ప్రయత్నమే చేశా. తిరుగుబాటుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం మీద, ప్రజల్లో నేను సంపాదించుకున్న స్థానం మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేశావు. ఇది చెల్లదు’ అని ఈటల అన్నారు.

డబ్బులు, బిల్లుల ఆశలు చూపుతూ.. పనులు కావని బెదిరింపులకు గురిచేస్తూ నాయకులను లొంగదీసుకుంటున్నారని, కానీ నియోజకవర్గ ప్రజలు మాత్రం తనను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని, ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. శుక్రవారం శామీర్‌పేటలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లో తన ప్రస్థానంతో పాటు వివిధ సందర్భాల్లో ఎదురైన అనుభవాలను వెల్లడిస్తూ.. సీఎం కేసీఆర్‌ వైఖరిని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.

ఈటల ఏమన్నారంటే..
ఉరి తీసేముందు కూడా... 
‘ఉరిశిక్ష పడిన వ్యక్తిని కూడా ఉరితీసే ముందు నీ చివరి కోరిక ఏమిటని అడిగే సాంప్రదాయం ఉంది. కానీ రాష్ట్రంలో ఈ రాజుగారి పాలనలో ఒక మంత్రి మీద ఓ అనామకుడు ఉత్తరం రాస్తే కనీసం నా దగ్గర నుంచి వివరణ కోరకుండానే రాత్రికి రాత్రి మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. అంతటితో ఆగకుండా సైన్యాధిపతులు హరీశ్, వినోద్‌ తదితరులకు హుజూరాబాద్‌ మీద దృషిŠట్‌ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 20 ఏళ్లలో హుజూరాబాద్‌ నియోజకవర్గం వైపు ఎన్నడూ ఎవరూ కన్నెత్తి చూడకున్నా ప్రజలతో మమేకమై కుటుంబసభ్యుల్లా కలిసి మెలిసి జీవించాం. కానీ ఈటల రాజేందర్‌ను ‘నీళ్లు లేని కాడ బొండిగ కోయి.. పాణం ఉండంగనే బొంద పెట్టు’అని ఆదేశాలు ఇచ్చారు. 

19 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నా..
నాకు ఎమ్మెల్యే, ప్లోర్‌ లీడర్, మంత్రి పదవులు బంగారు పళ్లెంలో పెట్టిచ్చామని కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతున్నారు. మాకు పదవి ఇవ్వలేదని ఏనాడూ మాట్లాడలేదు. ఎమ్మెల్యే పదవి సహా ఏ పదవి ఇచ్చినా పొంగిపోయినం. ఉద్యమం పాల్గొన్నాం. ప్రభుత్వంలో సేవలు అందించాం. ఎమ్మెల్యే పదవిని ఎలా తొలగించాలో ఆలోచిస్తున్నారట. అంత ఇజ్జత్‌ తక్కువ బతుకు వద్దు అని ప్రజలు చెప్తున్నరు. అందుకే 19 సంవత్సరాలుగా పార్టీతో ఉన్న అనుబంధం తెంచుకుంటూ రాజీనామా చేస్తున్నా. ఎన్నిసార్లు బీ ఫారమ్‌ ఇచ్చినా అన్నిసార్లూ గెలుస్తూ వచ్చా. మాజీ ఎంపీ వినోద్, మీ కుమార్తె కవితకు బీ ఫారం ఇచ్చినా గెలవలేకపోయారు. గులాబీ సైనికుడిగా గెలిచి ఉద్యమంలో భాగంగా ఆదేశించిన ప్రతిసారి ఎందుకు అని అడగకుండా రాజీనామా చేశాం. తెలంగాణ ఉద్యమ పుణ్యాన ఎమ్మెల్యేగా ఎన్నికై తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేశాం. 

తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు
2006 కరీంనగర్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో నాటి ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసినా డబ్బు, ప్రలోభాలను తట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేశాం. ఉద్యమ సమయంలో ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్న కేసీఆర్‌ ఈ రోజు డబ్బు సంచులు, కుట్రలు, అణచివేతలను నమ్ముకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఈ ప్రలోభాలకు లొంగరు. ఆకలిని భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు. ఇటీవలి నల్లగొండ, హైదరాబాద్‌ మండలి ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలో కుట్రలు కుతంత్రాలు, డబ్బు సంచులతో గెలవచ్చు. కానీ తెలంగాణ సమాజంలో ఈ తరహా ప్రయత్నాలకు చోటు లేదు.

బానిసల నిలయం అని పేరు పెట్టుకోమన్నాం
కేసీఆర్‌తో నాకు ఐదేళ్ల క్రితం నుంచే అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. నన్ను బొంద పెట్టమని అందిన ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌ నా మీద పనిచేస్తుండవచ్చు. కానీ ఆయన దుఃఖపడే సమయమొస్తే మిత్ర బృందం ఎవరూ అండగా ఉండరు. జిల్లాకు సంబంధించిన సమస్యపై ప్రగతిభవన్‌కు వెళ్తే అనుమతి లేదని ఆపేశారు. ఇదే తరహాలో మూడు పర్యాయాలు అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. మంత్రి పదవి పెద్దదే అయినా ఆత్మగౌరవం, బాధ్యతలు లేని బానిస పదవి మాకు వద్దని ఎంపీ సంతోష్‌కు చెప్పా. ప్రగతిభవన్‌ కాదు.. బానిసల నిలయం అని పేరు పెట్టుకోవాలని చెప్పాం. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు సీఎం కార్యాలయంలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్‌ అధికారి లేడు. మంత్రులు లేకుండానే సమీక్షలు జరిగిపోతాయి.

సంఘాలు వాళ్ల ఆధీనంలోనే ఉండాలట..
తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు చేర్చేందుకు పాలకుల మెడలు విరిచేందుకు ఆర్టీసీ, విద్యుత్, బొగ్గు గని కార్మిక సంఘాలు సహా ఎన్నో ఆంధ్రా సంఘాలను విడగొట్టి కొత్త సంఘాలు ఏర్పాటు చేసినం. కానీ ప్రస్తుతం ఆ సంఘాలు లేవు. నాయకులు లేరు. బొగ్గుగని కార్మిక సంఘం కవిత చేతిలో ఉంది. ఇతర సంఘాలు కూడా ఆమె నాయకత్వంలో పనిచేయాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. తెలంగాణ గడ్డ మీద సంఘాలు, సమ్మెలు ఉండకూడదని, ఒకవేళ సంఘాలు ఉన్నా తమ ఆధీనంలో ఉండాలని కేసీఆర్‌ అనుకుంటున్నారు. పార్టీలో హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, నల్లాల ఓదెలు వంటి వారి నుంచి సంఘాలను తప్పించారు. సంఘాలు, సమ్మెల విషయంలో ఉమ్మడి పాలకులు ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ వచ్చేదా?. 

ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమా?
సంక్షేమ పథకాలను నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. రైతు బంధును వందల కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను కట్టేవారికి ఇవ్వొద్దని మాత్రమే చెప్పా. గుట్టలు, కంచెలకు బెంజ్‌కార్లలో వచ్చి లక్షల రూపాయల రైతుబంధు తీసుకోవడం సరికాదని చెప్పా. సామాజిక పెన్షన్లు, రేషన్‌కార్డులు రాక ఇబ్బందులు పడుతున్నారు. పంటకొనే స్తోమత మిల్లర్లకు లేదు. ఐకేపీ సెంటర్లు ఉంటయి.. వడ్లు కొంటయి అని చెప్పడం తప్పా. ఇదేమైనా ప్రభుత్వానికి వ్యతిరేకమా? కుక్కిన పేనులా ఉండటం లేదని వాళ్ల బాధ. మంత్రి పదవి ఇచ్చి బానిసలాగా బతకమంటే బతుకతనా? మీకంటే ఉన్నత పదవులు ఎన్నడూ కోరలేదు. కేటీఆర్‌ కింద పనిచేసేందుకు సిద్ధమని నాతో పాటు హరీశ్‌ కూడా ప్రకటించారు. ఇది లాలూ ప్రసాద్‌ యాదవ్, మాయావతి, జయలలిత పెట్టిన పార్టీల లాంటిది కాదు. నా లాంటి లక్షల మంది ఉద్యమకారులు, వందల మంది బలిదానంతోనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ‘అందర్‌ వాలే బాహర్‌.. బాహర్‌ వాలే అందర్‌’ అన్నట్లుగా తయారైంది.

ఎంతోమందిని బయటకు పంపారు
నీకు కాపలాకాసిన వాళ్లు బయటకు, దూషించిన వాళ్లు పక్కకు చేరారు. నరేంద్ర విజయశాంతి, కోదండరాం ఇలా ఎంతో మందిని బయటకు పంపారు. నాలాంటోళ్ల మీద గజకర్ణ, గోకర్ణ టక్కుటమార విద్యలతో నన్ను ప్రజల నుంచి వేరు చేయాలని చూశావు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆస్తులు అమ్ముకునైనా ఆత్మగౌరవ పోరాటాన్ని వదిలిపెట్టం. ఉద్యమంలో రోడ్ల మీద రక్తం చిందించి జైలుకు వెళ్లాం. మస్కా కొడితే, కొనుక్కుంటే, దయతో, అడుక్కుంటే, మెప్పుతో పదవులు రాలేదు.. ఒళ్లు వంచి కొట్లాడితే వచ్చింది. కేసీఆర్‌కు చట్టాల మీద నమ్మకం లేదు. మంత్రులతో చర్చించకుండా, స్వేచ్ఛను ఇవ్వకుండా ఏ ప్రభుత్వమూ నడవలేదు. తెలంగాణ ప్రజలారా ఇది నూటికి నూరు శాతం నిజం. 

ప్రజాస్వామ్యంలో నియంతలకు చోటు లేదు
సంక్షేమ పథకాల వెలుగులో ప్రభుత్వం చేస్తున్న తప్పులు మరుగున పడేవి కావు. ఆత్మగౌరవానికి అభివృద్ధి ప్రత్యామ్నాయం కాదు. తెలంగాణ స్వతంత్రంగా బతకాలి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది. ప్రజల హృదయాలను గెలుచుకోండి. ప్రజాస్వామ్యంలో నియంతలకు చోటు ఉండదు. తెలంగాణ ఉద్యమం తరహాలో పాత ఉద్యమకారులు ప్రజాస్వామికవాదులు, భంగపడినోళ్లు, బాధపడినోళ్లు అందరూ ఒక్కటి కావడం ఖాయం..’  

మరిన్ని వార్తలు