Etela Rajender: రాజీనామా ప్రకటన తరువాత తొలిసారి..

9 Jun, 2021 09:54 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: గులాబీ గూటికి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవిని వదులుకోవడం కూడా ఖాయమైంది. బీజేపీలో చేరడానికి ముందు ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేసే అవకాశం ఉంది. తన రాజీనామాతో ఆరు నెలలలోపు జరిగే ఉప ఎన్నికలో పోటీ చేసి విజయకేతాన్ని ఎగరేసి తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని రాష్ట్రంలో వినిపించనున్నట్లు ఆయన చెపుతున్నారు. ఇందులో భాగంగా రాజీనామా ప్రకటన తరువాత తొలిసారిగా మంగళవారం ఆయన తన సొంత గ్రామం కమలాపూర్‌కు విచ్చేశారు.

ఈటలకు ఆయన వర్గీయులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హుజూరాబాద్‌లో జరిగే ఉప ఎన్నికలో విజయం అందిస్తామని ప్రజలు భరోసా ఇచ్చినట్లు వివరించారు. ఈ ఉపఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగనున్న సంగ్రామంగా అభివర్ణించారు. అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధి చెపుతామని, తెలంగాణ ద్రోహులతో కేసీఆర్‌ రాజ్యమేలుతున్నారని ఆయన తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

తనను టార్గెట్‌ చేసిన మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌ గురించి మాట్లాడకుండా కేసీఆర్‌పైనే విమర్శలకు దిగారు. హుజూరాబాద్‌లోనే కొద్దిరోజులు మకాం వేసే ఆలోచనతో ఉన్న ఈట ల బుధవారం కూడా కమలాపూర్‌ మండలంలోనే ఉండనున్నారు. తరువాత నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో పర్యటించే అవకాశం ఉంది. కాగా ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. 

స్పెషల్‌ ఫోకస్‌..
హుజూరాబాద్‌లో ఇన్నాళ్లూ ఈటల వెంట ఉన్న నాయకుల్లో 90 శాతానికి పైగా టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలతోపాటు జెడ్పీటీసీలను ఈటల వెంట వెళ్లకుండా అడ్డుకోవడంలో మంత్రి గంగుల కమలాకర్‌ విజయం సాధించారు. గ్రామాల్లో ఈటలకు మంచి సంబంధాలు ఉండడంతో ఆయా గ్రామాల్లో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని పార్టీ భావిస్తోంది.

గ్రామాల వారీగా పెండింగ్‌ పనులు, ఇప్పటికే పనులు మొదలై ఆగిపోయినవి, సర్పంచులు, ఎంపీటీసీలు చేసిన కాంట్రాక్టులకు బిల్లులు విడుదల కాకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని జిల్లా యంత్రాంగం ద్వారా ఆ పనులు పూర్తి చేయించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలు ప్రభుత్వం ద్వారా ‘సంతృప్తి’ చెందే విధంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను డిజైన్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 

11 నుంచి టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌
ఈనెల 11వ తేదీన మంత్రులు హరీశ్‌రావు, గంగుల, కొప్పులతోపాటు ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్, ఇతర ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం. పార్టీ కేడర్‌కు తామున్నామని ధైర్యం చెప్పడంతో పాటు స్థానిక పరిస్థితుల ఆధారంగా వచ్చే ఉప ఎన్నికలో హుజూరాబాద్‌లో పార్టీ అభ్యర్థి విజయానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ తయారు చేసే అవకాశం ఉంది. పార్టీ నాయకుల ద్వారా ఈటలపై విమర్శలు చేయించడమే కాకుండా కాంగ్రెస్, బీజేపీలలో ఉన్న నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్పించుకొనే ఆలోచనతో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నాయకులను ఇప్పటి నుంచే హుజూరాబాద్‌లో తిష్ట వేయించే ఆలోచనతో ఉన్నారు. ఈటల వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ‘కౌంటర్‌ ఆపరేషన్‌’ నిర్వహించే ప్లాన్‌లను అమలు చేస్తున్నారు. 

ఈటలపై వ్యూహాత్మక దాడికి మంత్రుల సన్నాహాలు
టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ఈటల ఎమ్మెల్యే పదవిని వదులుకొని టీఆర్‌ఎస్‌పై  పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనను రాజకీయంగా ఒంటరిని చేసే వ్యూహాన్ని టీఆర్‌ఎస్‌ అమలు చేస్తోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ నివాసంలో భేటీ అయిన ఇతర మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సన్నిహిత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, వరంగల్‌కు చెందిన చల్లా ధర్మారెడ్డి, రమేశ్, కరీంనగర్‌ మేయర్‌ వై.సునీల్‌రావు తదితరులు హుజూరాబాద్‌లో అనుసరించబోయే వ్యూహాలపై చర్చించారు.

ఈటల రాజేందర్‌ బీజేపీలోకి వెళ్లడం ఖాయమైన నేపథ్యంలో గత ఎన్నికల్లో అక్కడ బీజేపీకి గల బలంపై చర్చించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో నోటా కన్నా తక్కువగా 2 వేలలోపు ఓట్లు పోలు కాగా, ఎంపీ ఎన్నికల్లో మోదీ హవాలో కరీంనగర్‌ను గెలుచుకున్న బీజేపీ హుజూరాబాద్‌లో మాత్రం మూడోస్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీకి ఈటలతో బలం పెరుగుతుందే తప్ప బీజేపీ వల్ల ఈటలకు ఉపయోగం లేదని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈటల ఇమేజ్‌ను దెబ్బకొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.  

చదవండి: హుజూరాబాద్‌ మరో ఉద్యమానికి నాంది కాబోతోంది: ఈటల

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు