మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత

5 Aug, 2020 04:41 IST|Sakshi

విజయవాడలో కరోనాతోచికిత్స పొందుతూ తుదిశ్వాస 

భద్రాచలం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/వీఆర్‌పుర : ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన కమ్యూనిస్టు యోధుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (62) కరోనా కాటుకు బలయ్యారు. ఏపీ రాష్ట్రం విజయవాడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రాజయ్య.. భద్రాచలంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని స్వగ్రామమైన సున్నంవారిగూడెంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన కుటుంబంలో పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ సమయంలో రాజయ్యకు పరీక్ష చేయగా నెగిటివ్‌ వచ్చినప్పటికీ, ఆ మరుసటి రోజు నుంచి జ్వరం వస్తూనే ఉంది. చికిత్స చేయించుకున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో సోమవారం భద్రాచలంలో మరోసారి కోవిడ్‌ పరీక్ష చేయించారు. అక్కడ ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే చికిత్స కోసం విజయవాడ తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు.

కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా మంగళవారం రాజయ్య అంత్యక్రియలను ఆయన స్వగ్రామంలో కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. రాజయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం అసెంబ్లీ స్థానానికి సీపీఎం తరఫున 1999, 2004, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ రాష్ట్రం రంపచోడవరం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజయ్యకు తల్లి కన్నమ్మ, భార్య చుక్కమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

ఆదివాసీలతో మమేకమై..
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌ పురం మండలం సున్నంవారిగూడెం గ్రామానికి చెందిన రాజయ్య 1958 ఆగస్టు 8న జన్మించారు. 1979 నుంచి ఆయన సీపీఎంలో పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని లెభద్రాచలం డివిజన్‌ డీవైఎఫ్‌ఐ కార్యదర్శిగా సీపీఎంలో ప్రస్థానం ప్రారంభించిన రాజయ్య.. సాదాసీదా జీవితం గడుపుతూ, నిత్యం ఆదివాసీలతో మమేకమై నడిచారు. ఆదివాసీల హక్కుల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 600 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన పోరాట యోధుడు. చివరి వరకు నిరాడంబర జీవితం గడిపిన ఆయన మృతి ఆదివాసీ గిరిజనుల్లో తీవ్ర విషాదం నింపింది. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఏపీలోకి వెళ్లడంతో అక్కడి గిరిజనుల సమస్యలపై గళం వినిపించేందుకు న్యాయస్థానంలో పోరాటం చేశారు. నిత్యం గిరిజన పల్లెల్లో తిరిగే రాజయ్యను కరోనా కాటు వేయడం ప్రతి ఒక్కరినీ విషాదంలో నింపింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా