పరువు తీశారని మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య

24 Dec, 2022 09:10 IST|Sakshi
రోడ్డుపై ధర్నా చేస్తున్న సురేష్‌ కుటుంబ సభ్యులు

పీఏసీఎస్‌ చైర్మన్‌ దంపతుల వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు

దంపతులపై కేసు నమోదు

రోడ్డుపై బైఠాయింపు, ధర్నాకు జీఎస్‌ఆర్‌ మద్దతు 

సాక్షి, వరంగల్‌(శాయంపేట): తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయడంతోపాటు పరువుతీశారని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మాజీ సర్పంచ్‌ చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. అతని మృతికి పీఏసీఎస్‌ చైర్మన్‌ దంపతులే కారణమని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన శుక్రవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..హుస్సేన్‌పల్లి గ్రామానికి చెందిన భూతాల సురేష్‌ (40) పత్తి, మక్కలు, వరిధాన్యం కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపార అవసరాల నిమిత్తం శాయంపేట గ్రామానికి చెందిన పీఏసీఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌ వద్ద 5నెలల క్రితం రూ.20లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో శాయంపేటలోని తన రెండు అంతస్తుల భవనాన్ని బ్యాంక్‌లో పెట్టి లోన్‌ తీసుకోవడానికి డాక్యుమెంట్స్‌ తయారు చేసుకున్నాడు. 20 రోజులనుంచి తన అప్పు చెల్లించాలని శరత్‌.. తరచూ సురేష్‌ ఇంటికి వెళ్లి దూషిస్తున్నాడు.

ఈ క్రమంలో ఇటీవల శరత్‌.. సురేష్‌ను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి ఇంటి పత్రాలు ఇవ్వాలని మూడు గంటలపాటు నిర్బంధించాడు. విషయాన్ని సురేష్‌ ఫోన్‌లో తన మిత్రులకు తెలియజేయడంతో వారు వచ్చి ఇంటి డాక్యుమెంట్స్‌ అప్పగించి అతన్ని తీసుకెళ్లారు. ఈ నెల 16న సురేష్‌ శాయంపేటలోని తన ఇంటికి అమ్మకానికి బోర్డు పెట్టాడు. విషయం తెలుసుకున్న శరత్‌ అతని భార్య రమాదేవి ఈ నెల 19న సురేష్‌ ఇంటికి వెళ్లి చుట్టుపక్కల వారి ముందు అప్పు విషయంలో దుర్భాషలాడుతూ సురేష్‌పై దాడి చేశారు. అవమానాన్ని భరించలేక సురేష్‌ అదేరోజు సాయంత్రం కొత్తగట్టుసింగారం శివారు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు.

చైర్మన్‌ దంపతుల వేధింపుల వల్లే తాను మానసికంగా కుంగిపోయి పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని సురేష్‌ను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. అప్పుగా తీసుకున్న రూ. 20లక్షలు చెల్లించాలని వేధింపులకు గురిచేయడం, ఇంటి ఒరిజినల్‌ దస్తావేజులు ఇవ్వాలని నిర్బంధించడం, కాలనీవాసుల ముందే పీఏసీఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌ దంపతులు దుర్భాషలాడుతూ కొట్టడంతో మనస్తాపం చెంది తన భర్త సురేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడని భార్య రాణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కుసుమ శరత్, భార్య రమాదేవిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. 

రోడ్డుపై ధర్నా .. 
పీఏసీఎస్‌ చైర్మన్, అతని భార్యపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు సాయంత్రం నాలుగు గంటల నుంచి పత్తిపాక–శాయంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. పరకాల ఏసీపీ శివరామయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు మద్దతు ప్రకటించారు. బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా, సురేష్‌ మృతిపై బంధువులు చేసిన ఆరోపణలపై పీఏసీఎస్‌ చైర్మన్‌ శరత్‌ను వివరణ కోరేందుకు ఎంతసేపు ప్రయత్నించినా స్పందించలేదు.

మరిన్ని వార్తలు