గురువు రుణం తీర్చుకున్నాడు

14 May, 2021 14:45 IST|Sakshi

మాజీ వీసీ సాంబయ్య చితికి నిప్పంటించిన శిష్యుడు

 అంత్యక్రియలు నిర్వహించలేని స్థితిలో కుటుంబసభ్యులు

కేయూ క్యాంపస్‌ (వరంగల్‌): పాతికేళ్ల గురు శిష్యుల అనుబంధం వారిది.. అయితే ఆ అనుబంధాన్ని కోవిడ్‌ చిదిమేసింది. కోవిడ్‌ కారణంగా గురువు చనిపోవడంతో శిష్యుడే అంత్యక్రియలు పూర్తిచేసి గురువు రుణం తీర్చుకున్నాడు. మాజీ వీసీ పశుల సాంబయ్య బుధవారం హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతిచెందగా ఆయన మృతదేహాన్ని పరకాల మండలం నాగారానికి తీసుకొచ్చారు.  ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కుమారుడు వరుణ్‌కు ఇటీవల కరోనా సోకి తగ్గినా ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

కుమార్తె ప్రణయ గర్భవతి కావడంతో అంత్యక్రియలు పూర్తిచేసే అవకాశం లేకుండా పోయింది. కనీసం వరుణ్‌ చేయి పట్టుకుని తలకొరివి పెట్టిద్దామదనుకున్నా ఆయన నీరసించి నిలబడలేని స్థితికి చేరడంతో సాంబయ్య శిష్యుడు డాక్టర్‌ బండి శ్రీను గురువు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆచార్య సాంబయ్యతో తనకు పాతికేళ్ల అనుబంధం ఉందని, తన తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనలోనే తండ్రిని చూసుకుంటున్నానని,ఆయన పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తిచేసిన తాను ఇలా రుణం తీర్చుకున్నానని వెల్లడించారు.

(చదవండి: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా: నలుగురు మృతి)

మరిన్ని వార్తలు