‘ఫార్ములా ఈ రేసింగ్‌’కు హైదరాబాద్‌ ఆతిథ్యం

1 Jul, 2022 00:46 IST|Sakshi
రేసు జరిగే ప్రాంతం

వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న నెక్లెస్‌ రోడ్డులో రేసింగ్‌

ఈ–ప్రిక్స్‌ జరిగే తొలి భారతీయ నగరం హైదరాబాద్‌

మొబిలిటీ రంగంలో అభివృద్ధికి అవకాశం: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్‌’లో భాగంగా జరిగే ‘ఫార్ములా ఈ రేసింగ్‌’ (ఈ–ప్రిక్స్‌)కు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరిగే ఫార్ములా ఈ రేసింగ్‌ కు ఎఫ్‌ఐఏ వరల్డ్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ తాజాగా ఆమోదం తెలిపింది. ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్‌ (సింగిల్‌ సీట్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలకు నిర్వహించే పోటీలు)

తొమ్మిదో సీజన్‌ కేలండర్‌ను రెండు రోజుల క్రితం కౌన్సిల్‌ ఖరారు చేసింది. నగరానికి అవకాశం లభించడంతో ఈ–ప్రిక్స్‌ నిర్వహణకు భారత్‌లో ఎంపికైన తొలి నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు లభించింది. ఈ–ప్రిక్స్‌ నిర్వహణ ద్వారా ప్రపంచ మోటార్‌ స్పోర్ట్స్‌ చిత్రపటంలో భారత్‌కు చోటు దక్కుతుందని భావిస్తున్నారు.

2.37 కిలోమీటర్ల పొడవు..8 మలుపులు
2.37 కిలోమీటర్ల పొడవులో మొత్తం 8 మలుపులు, మూడు సెక్టార్లుగా విభజించి నెక్లెస్‌ రోడ్డుపై రేసింగ్‌ను నిర్వహిస్తారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈ ఈవెంట్‌ జరిగే నాటికి రేసింగ్‌కు అనుగుణంగా రహదారిని పూర్తిగా సిద్ధం చేస్తామని ఓ అధికారి వివరించారు. ఈ–ప్రిక్స్‌ నిర్వహణకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో ‘ఫార్ములా ఈ’తో కుదిరిన అవగాహన పత్రంపై తెలంగాణ సంతకం చేసింది.

ఇదిలా ఉంటే 2011 నుంచి 2013 వరకు వరుసగా మూడేళ్ల పాటు భారత్‌లోని బుద్ద ఇంటర్నేషనల్‌ సరŠూయ్యట్‌ ఫార్ములా వన్‌ రేస్‌కు ఆతిథ్యం ఇవ్వగా, మరోసారి అతిపెద్ద ప్రపంచ స్థాయి మోటార్‌ స్పోర్ట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు భారత్‌లో జరగనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 18 రేస్‌లు
ఈ ప్రిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ తొమ్మిదో సీజన్‌లో భాగంగా వచ్చే ఏడాది జూలై వరకు మొత్తం 18 రేస్‌లు ప్రపంచం లోని వివిధ నగరాల్లో  జరుగుతాయి. 2014లో ఈ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం కాగా.. ఏడేళ్ల తర్వాత 2020–21 నుంచి ఈ పోటీలకు ప్రపంచ స్థాయి ఛాంపియన్‌షిప్‌ హోదాకు ఆమోదం లభించింది. ఈ ఛాంపియన్‌షిప్‌ మొదట్నుంచే మహీంద్రా రేసింగ్‌ ఇందులో భాగస్వామిగా ఉంటూ వస్తోంది. తొలినాళ్లలో కరుణ్‌ చందోక్‌ అనే భారతీయుడు ఈ–ప్రిక్స్‌లో పాల్గొన్నాడు. 

వీధుల్లో జరిగే ఈ–ప్రిక్స్‌ రేస్‌లు
ఫార్ములా వన్‌ రేసులు ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్లలో జరుగుతాయి. అయితే ఈ–ప్రిక్స్‌ రేస్‌లు మాత్రం పెద్ద నగరాల్లోని వీధుల్లో జరుగుతాయి. ఈ రేస్‌లు మోటార్‌ స్పోర్ట్‌ అభిమానులకు వినోదం పంచడంతో పాటు ఎలక్ట్రిక్‌ వాహన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దోహదం చేస్తాయి. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రయత్నాలతోనే హైదరాబాద్‌లో ఈ–ప్రిక్స్‌ జరగనుందని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. కాగా మొబిలిటీ రంగంలో అభివృద్ధి చెందాలనుకునే ఎంట్రప్రెన్యూర్స్‌తో పాటు ఫిన్‌టెక్, మెడ్‌టెక్‌ రంగాలకు ఇది అతిపెద్ద అవకాశమని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు