నాటేసేందుకు వెళ్తుండగా కాటేసిన మృత్యువు

29 Jan, 2022 02:57 IST|Sakshi
భద్రాద్రి జిల్లా తిప్పనపల్లిలో జరిగిన ప్రమాదానికి కారణమైన బొగ్గు టిప్పర్‌ 

భద్రాద్రి జిల్లా చండ్రుగొండలో బొలేరోను ఢీకొట్టిన బొగ్గు టిప్పర్‌ 

నలుగురు మహిళాకూలీలు మృతి, మరొకరి పరిస్థితి విషమం 

డ్రైవర్‌ సహా మరో 13 మందికి గాయాలు 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చండ్రుగొండ: నాటేసేందుకు బయలుదేరినవారి లో నలుగురిని మృత్యువు టిప్పర్‌ రూపంలో కాటేసింది. మరో 13 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. మృతులు, క్షతగాత్రులందరూ ఒకే గ్రామానికి చెందినవారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బొగ్గులోడ్‌ తో వెళ్తున్న ఓ టిప్పర్‌ అతివేగంగా వచ్చి ఢీకొని 100 మీటర్ల వరకు బొలేరోను ఈడ్చుకుంటూ వెళ్లింది.

ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న ఇంటి ముందు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కూలీలు కత్తి స్వాతి(26), ఎక్కి రాల సుజాత(35) అక్కడికక్కడే మృతి చెం దగా, గాయపడిన కత్తి సాయమ్మ, గుర్రం లక్ష్మి కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. మరోకూలీ కత్తి లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. కత్తి నాగయ్య, ఆయన భార్య వెంకటరమణ, కత్తి సుగుణ, గుర్రం అచ్చమ్మ, రాందాస్, గుర్రం నర్సమ్మ, కత్తి సుశీల, వెంకటనారాయణ, పిడమర్తి సావిత్రి, రైతు ఆళ్ల వీరయ్య, ఆయన భార్య ఆళ్ల పద్మ, బొలెరో డ్రైవర్‌  రాందాస్‌ కూడా గాయాలపాలయ్యారు. వీరి లో కొందరికి కొత్తగూడెం జిల్లా ఆస్పత్రిలో, మరికొందరిని ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.  

ఎవరీ కూలీలు 
చండ్రుగొండ మండలంలోని తుంగారం గ్రామానికి చెందిన ఆళ్ల వీరయ్య తన వరి పొలం నాటు వేసేందుకు సుజాతనగర్‌ మండలం హరిజనవాడకు చెందిన 15 మంది కూలీలను మాట్లాడుకున్నాడు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని రాజాపురంలో ఓ రైతు వద్ద కొనుగోలు చేసిన నారును తీసుకురావడానికి బొలేరో వాహనంలో కూలీలను తీసుకొని బయల్దేరాడు.

మార్గమధ్యంలో తిప్పనపల్లి వద్ద ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బొలేరోలో డ్రైవర్‌తోపాటు 16 మంది ఉన్నారు. టిప్పర్‌ తమ ఇంటి ముం దే బోల్తా పడిందని, అక్కడే ఉన్న తాము తృటి లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని ఖాజాబీ, ఆమె మనవడు అబ్దుల్‌ ముఖీబ్‌ ‘సాక్షి’తో చెప్పారు.  

పదిగంటలపాటు ఆందోళన 
బొగ్గు లారీల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మృతుల బంధువులు, స్థానికులు తిప్పనపల్లిలో హైవేపై పదిగంటలపాటు ఆందోళనకు దిగారు.  ఆర్డీవో స్వర్ణలత ఆందోళనకారులతో చర్చలు జరిపారు. సింగరేణి డైరెక్టర్‌(పా) చెన్నై నుంచి ఫోన్‌లో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.50 వేల తక్షణసాయం, కుటుంబంలో ఒకరికి  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం, ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు విషయమై మంత్రులతో చర్చిస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు.  

మరిన్ని వార్తలు