విధి వైపరీత్యం అంటే ఇదేనేమో.. కళ్ల ముందే నలుగురు కొడుకులు

30 Apr, 2022 17:59 IST|Sakshi
కుమారుడి కుటుంబంతో రామనర్సమ్మ (ఫైల్‌) 

అనారోగ్య సమస్యలు.. రోడ్డు ప్రమాదాలతో కుటుంబం కుదేల్‌

అవసాన దశలో ఒంటరైన వృద్ధురాలు 

సాక్షి, చిలుకూరు (నల్గొండ): విధి వైపరీత్యం అంటే ఇదేనేమో. భర్తతో పాటు నలుగురు కుమారులు ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా లోకాన్ని విడిచారు. అవసాన దశలో మనువళ్లు, మనవరాళ్లతో శేష జీవితాన్ని గడపాల్సిన తరుణంలో ఆ వృద్ధురాలిని విధి వెక్కిరించింది. అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల రూపంలో నలుగురు కొడుకులను కోల్పోయిన ఆ వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతోంది. తాజాగా గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్న కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. చివరకు దహన సంస్కారాలు నిర్వహించే స్థోమత కూడా లేకపోవడంతో గ్రామస్తులు ముందుకొచ్చి ఆ తంతు పూర్తి చేయించిన ఓ తల్లి దీనగాథ ఇదీ.

25ఏళ్ల క్రితం భర్త..
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన దాసోజు మోహన్‌రావు, రామనర్సమ్మ దంపతులది పేద కుటుంబం. వీరికి నలుగురు కొడుకులు, కూతురు సంతానం.మోహనరావు అనారోగ్య సమస్యతో సుమారుగా 25ఏళ్ల క్రితమే కనుమూశారు. అప్పటికే కూతురుతో పాటు నలుగురు కుమారుల్లో ముగ్గురికి వివాహాలు జరిగాయి. అయితే రెండో కుమారుడు శ్రీనివాస్‌రావు తండ్రి చనిపోయిన కొన్నేళ్లకే అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. ఇతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అ తర్వాత ముడో కుమారుడు రామారావు 14 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు బస్సులో వెళ్తూ బీపీ డౌన్‌ అయి అక్కడికక్కడే మృతిచెందాడు. వీరికి పిల్లలు లేరు. ఆ ఘటన మరుకముందే కొన్నాళ్లకు పెద్ద కుమారుడు బాబురావు అనారోగ్య సమస్యలతో మృతిచెందాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

చదవండి👉🏼 (Hyderabad: మద్యం తాగిస్తూ మత్తులో ఉంచి.. అతి కిరాతకంగా..)

రోడ్డు ప్రమాదంలో నాలుగో కుమారుడు..
కాగా, ఆ కుటుంబానికి వరుసగా  ఏదో ఒక ఘటన జరుగుతూ వృద్ధురాలి కుమారులు చనిపోతున్నారు. నాలుగో కుమారుడు మధవరావుకి కుమార్తె రాజేశ్వరి కూతురు నాగశ్రీని ఇచ్చి వివాహం జరిపించారు. అయితే, గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగో కుమారుడు మాధవరావు దుర్మరణం చెందాడు. ఇతడికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. నలుగురు కొడుకులు ఉన్నా ఆ వృద్ధురాలు చివరకు అనాథగా మిగిలిపోయింది. కళ్ల ముందే నాలుగు కుటుంబాలు చిన్నాభిన్నం కావడంతో అ వృద్ధురాలు దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. చివరకు అ కుటుంబాలకు మగదిక్కు లేకుండా పోయింది. మాధవరావు దహన సంస్కరాలను సోదరుల కుమారులు జరిపించారు. ఆ కుటుంబంలో జరుగుతున్న వరుస ఘటనలను చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అనుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు