కేటీకే 8వ గనిలో ప్రమాదం నలుగురు కార్మికులకు గాయాలు  

9 Sep, 2022 02:05 IST|Sakshi
గాయపడిన కార్మికుడికి సింగరేణి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు    

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8వ గనిలో గురువారం కోల్‌ కట్టింగ్‌లో భాగంగా బ్లాస్టింగ్‌ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. కార్మికులు, అధికారుల కథనం ప్రకారం.. గనిలోని 3వ సీమ్‌ 21వ లెవల్‌లో ఉదయం మొదటి షిఫ్ట్‌లో కోల్‌కట్టింగ్‌ కార్మికులు సీహెచ్‌ రామకృష్ణ, బండి రాజశేఖర్, ఈర్ల శ్రీనివాస్‌తోపాటు భూక్య గంగ్య అనే యాక్టింట్‌ కోల్‌ కట్టర్‌.. బొగ్గును తొలిచేందుకు పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్‌ చేశారు.

రెండోసారి కూడా బ్లాస్టింగ్‌ చేసేందుకు డ్రిల్స్‌ చేస్తున్నారు. ముందు పెట్టిన పేలుడు మందు ఒక చోట పేలకుండా ఉండిపోయింది. దీనిని గమనించకుండా డ్రిల్స్‌ చేస్తుండగా ఆ పేలుడు పదార్థానికి డ్రిల్లింగ్‌ మెషీన్‌ బలంగా తగలడంతో ఒక్కసారిగా పేలింది. దీంతో రామకృష్ణ, రాజశేఖర్, శ్రీనివాస్‌లకు తీవ్రగాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ గంగ్య భయంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆ నలుగురిని సింగరేణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు  తరలించారు.  

మరిన్ని వార్తలు