ప్రాణం తీసిన ఈత సరదా

22 Jan, 2022 03:39 IST|Sakshi
జూరాల ఎడమ కాల్వలో ఆరిఫ్‌ కోసం గాలిస్తున్న జాలర్లు, గ్రామస్తులు 

జూరాల కాల్వలో కొట్టుకుపోయిన నలుగురు

ఒక బాలుడి మృతి, ముగ్గురిని కాపాడిన రైతులు

అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వలో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు పిల్లలతో పాటు ఓ వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకెళ్లారు. ఇందులో ఓ బాలుడు మృతి చెందగా, ముగ్గురిని స్థానిక రైతులు కాపాడారు. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని నందిమళ్లలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నందిమళ్లకు చెందిన మహమూద్‌ తన కొడుకు మౌలాలి, అదే గ్రామానికి చెందిన సలావుద్దీన్, ఆరిఫ్‌ (10) అనే పిల్లలను వెంట పెట్టుకుని జూరాల ఎడ మ కాల్వలో స్నానం చేయడానికి వెళ్లాడు.

అందరూ కలసి ఈత కొడుతుండగా ఒక్క సారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ప్రవాహ వేగానికి మౌలాలి, సలావుద్దీన్, ఆరిఫ్‌ కొట్టుకుపోతుండడంతో.. మహమూద్‌ వెంటనే తన కొడుకు మౌలాలి, సలావుద్దీన్‌లను కాల్వ ఒడ్డువైపు నెట్టేశాడు. అదే సమయంలో మహమూద్‌ సైతం నీటి ప్రవాహం లో కొట్టుకుని పోతుండగా, చిన్నారుల కేకలకు అక్కడే ఉన్న కురుమూర్తి, లంకాల మల్లేశ్‌లు కాల్వలో దూకి మహమూద్‌ను, ఇద్దరు పిల్లలను కాపాడారు. అప్పటికే నీటి ప్రవాహానికి ఆరిఫ్‌ కొట్టుకుపోయాడు.  

3 గంటల పాటు గాలింపు..  
ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆరీఫ్‌ కోసం నందిమళ్లకు చెందిన జాలర్లు, యువకులు కాల్వలో గాలింపు చేపట్టారు. దాదాపు 3 గంటల పాటు వెతికి నీటిలో విగతజీవిగా పడి ఉన్న ఆరిఫ్‌ (10) మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. నీటిలో గల్లంతైన తమ కొడుకు ఆరి ఫ్‌ మృతి చెందాడనే వార్త వినగానే అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వారి రోద న పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మహేశ్‌గౌడ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు