రోడ్డుపై నాలుగు పులులు 

25 Feb, 2023 01:47 IST|Sakshi
రోడ్డుపై నుంచి పంట చేలవైపు వెళ్తున్న నాలుగు పులులు   

గొల్లఘాట్‌ శివారులో అర్ధరాత్రి సంచారం..  

తాంసి: ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం గొల్లఘాట్‌ శివారులో పంట చేలకు వెళ్లే రహదారిపై నాలుగు పులులు సంచరిస్తూ కనిపించాయి. గ్రామం సమీపంలో పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల కోసం భీంపూర్‌ మండలంలోని మార్కగూడ, రాంపూర్‌ గ్రామాల నుంచి మట్టిని టిప్పర్లలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి డ్రైవర్‌ సాజిద్‌ టిప్పర్‌లో మట్టిని తీసుకొచ్చే క్రమంలో గ్రామానికి సమీపంలో ఉన్న మట్టి రోడ్డుపై నాలుగు పులులు కనిపించాయి.

వెంటనే వాహనం నిలిపివేసి వాటిని వీడియో తీశాడు. ఈ సందర్భంగా అలికిడి కావడంతో అవి పంట చేల వైపు వెళ్లాయి. పులుల సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి గులాబ్‌సింగ్, సెక్షన్‌ అధికారి అహ్మద్‌ఖాన్‌ పులులు సంచరించిన ప్రదేశాలను పరిశీలించి వాటి పాదముద్రల ఆనవాళ్లను గుర్తించారు. రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పిల్లలతో సంచరించిన పులి మళ్లీ వచ్చినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పులుల సంచారం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.  

మరిన్ని వార్తలు