అంగన్‌వాడి కేంద్రంలో చిన్నారి మృతి! 

26 Nov, 2021 04:00 IST|Sakshi

పాదంపై పాముకాటు గుర్తులు

విచారణ కోసం పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు   

గజ్వేల్‌ రూరల్‌: అంగన్‌వాడి కేంద్రానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం బయ్యారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కామల్ల రాజు–సంతోష దంపతులకు కొడుకు, కూతురు నిత్య (4) ఉన్నారు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం నిత్య అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నిత్య ఎడమ కాలుకు రక్తం కారుతుండడాన్ని గమనించిన ఆయా పసుపుతో కట్టుకట్టి గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెట్టింది.

అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలంతా భోజనం చేసిన తర్వాత 2గంటల ప్రాంతంలో నిత్యను నిద్రనుంచి లేపేందుకు ప్రయత్నించగా, లేవకపోవడంతో తల్లి సంతోషకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న నిత్యను గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు అప్పటికే నిత్య మృతి చెందినట్టు తెలిపారు. నిత్య ఎడమకాలు పాదం భాగంలో పాముకాటు గుర్తులున్నాయని, తమ కూతురి మృతిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ అశోక్‌కు ఇచ్చిన ఫిర్యాదులో నిత్య తల్లిదండ్రులు పేర్కొన్నారు. నిత్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు