కొంగర కలాన్‌లోనే ‘ఫాక్స్‌కాన్‌’

7 Mar, 2023 01:21 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యంగ్‌ ల్యూ లేఖ

సాధ్యమైనంత త్వరగా తయారీ కేంద్రం పనులు ప్రారంభిస్తాం

మీ పూర్తి సహాయ సహకారాలు కోరుతున్నా

రాష్ట్ర పర్యటనలో తమకు అద్భుత ఆతిథ్యం లభించిందని కితాబు

తన వ్యక్తిగత అతిథిగా తైవాన్‌ను సందర్శించాలని ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ తన తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్‌ యంగ్‌ ల్యూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. దీంతో రాష్ట్రంలో ఆ పరిశ్రమ ఏర్పాటుపై తలెత్తిన అనుమానాలకు తెరపడింది.

ఈ నెల 2న ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యంగ్‌ ల్యూ బృందం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో భేటీ అయ్యారు. ఆ తరువాత బెంగళూరు వెళ్లి కర్ణాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మైని సైతం కలిశారు. అనంతరం లక్ష ఉద్యోగాలు కల్పించేలా ఫాక్స్‌కాన్‌ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలో ఆ సంస్థ ఏర్పాటుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటికి సమాధానంగా అన్నట్లు ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

మీ సంపూర్ణ మద్దతు కోరుతున్నా..
‘మేము వీలైనంత త్వరలో కొంగరకలాన్‌లో మా సంస్థ ఉత్పత్తిని ప్రారంభిస్తాం. అందుకు మీ సంపూర్ణ మద్దతు కోరుతున్నా. హైదరాబాద్‌ పర్యటనలో అద్భుతమైన సమయాన్ని గడిపాం. మీ ఆతిథ్యం మమ్మల్ని బాగా ఆకట్టుకుంది. నా పుట్టిన రోజున స్వదస్తూరితో మీరు గ్రీటింగ్‌ కార్డు ఇవ్వడం వ్యక్తిగతంగా అమితానందాన్ని కలిగించింది’అని లేఖలో యంగ్‌ ల్యూ పేర్కొన్నారు.

భారత్‌లో నాకు కొత్త స్నేహితుడు..
‘తెలంగాణ అభివృద్ధి దిశగా పురోగమించడానికి మీరు చేస్తున్న కృషి, కనబరుస్తున్న దార్శనికత నుంచి స్ఫూర్తి పొందా. నాకు ఇప్పుడు భారత్‌లో కొత్త స్నేహితుడు ఉన్నారు. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా. తైపీలో మీకు ఆతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తా. త్వరలోనే మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నా’అని యంగ్‌ ల్యూ లేఖలో తెలిపారు.

రాష్ట్రానికి గొప్ప విజయం: సీఎంవో
తెలంగాణలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ చైర్మన్‌ యంగ్‌ ల్యూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం పారిశ్రామిక రంగంలో రాష్ట్రానికి దక్కిన గొప్ప విజయంగా భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.  

మరిన్ని వార్తలు