ఐదుగురు ఎస్సైలను మోసం చేసిన కి‘లేడీ’ మరో అవతారం

7 Apr, 2021 19:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మోసం చేయడంలో ఆమె దిట్ట. అమాయకులనే కాదు ఏకంగా పోలీసులను కూడా మోసం చేయడం ఆమె గొప్పతనం. ఐదు మంది ఎస్సైలను మోసం చేసిన ఆమె ఇప్పుడు మరో సరికొత్త అవతారంలో బయట తిరుగుతోంది. అమాయకులను లక్ష్యంగా చేసుకుని అందిక కాడికి దోచుకుంటోంది. ఆ మహిళ బారినపడి మోసపోయిన వారంతా గోడు వెళ్లబోసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆ బాధితులు కోరుతున్నారు. ఆమె గురించి కొన్ని షాకింగ్‌ విషయాలు చెప్పారు.

గతంలో ఐదు మంది ఎస్ఐలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్నది కిలాడి లేడి శ్రీలతా రెడ్డి. ఆమె ఇప్పుడు మరో నయా దందాతో ప్రజలని మోసం చేయడం మొదలుపెట్టింది. చిట్టీల పేరుతో అమాయక ప్రజలను బృందంగా చేసి 5 లేదా 6 నెలలు కట్టించుకున్న బిచాణా ఎత్తి వేస్తుంది. ఇదేంటి? అని బాధితులు ప్రశ్నిస్తే.. బ్లాక్ మెయిల్ చేస్తుందని వాపోతున్నారు. నేను పోలీస్‌లపైనే కేసు పెట్టాను.. మీరెంత అంటూ బెదిరింపులకి పాల్పడుతుందని ఆమె బాధితులు చెబుతున్నారు. 

ఇలా మూడు చిట్టీల పేరుతో ఏకంగా ఆమె 60 మందిని మోసం చేసింది. ఆమె గురించి వనస్థలిపురంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించి బాధితులు తమ గోడు చెప్పుకొచ్చారు. గతంలో శ్రీలతారెడ్డిపై ఎల్బీనగర్, వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలలో ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టయి జైలుకు కూడా వెళ్లి వచ్చింది. అయితే డబ్బులు ఉన్న వాళ్లను పరిచయం చేసుకుని మాయమాటలతో వలలో వేసుకుని డబ్బులు లాగి ఇలా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపించారు. ఇలాంటి మాయలేడీపై పీడీ చట్టం నమోదు చేయలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు