స్పీడ్‌గా స్పందించారా.. అయితే అలర్ట్‌ అవాల్సిందే!

9 Mar, 2023 07:32 IST|Sakshi

 నకిలీ బ్యాంక్‌ గ్యారెంటీల గ్యాంగ్‌ చిక్కింది ఇలా 

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ పేరుతో హర్షిత కంపెనీకి బోగస్‌ గ్యారంటీలు 

సరి చూసేందుకు ఈ–మెయిల్‌ ఇచ్చిన మున్సిపల్‌ శాఖ 

ఐదు నిమిషాల్లోనే సమాధానం రావడంతో అనుమానం 

రీజినల్‌ కార్యాలయాన్ని సంప్రదించడంతో దందా వెలుగులోకి 

అంతర్‌ రాష్ట్ర ముఠా అరెస్టు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగంతో పాటు బ్యాంకింగ్‌ సెక్టార్‌లోనూ కొన్ని అంశాల్లో తీవ్ర జాప్యం ఉంటుంది. ప్రధానంగా ఉత్తర ప్రత్యుత్తరాలకు రోజులు, వారాలే కాదు అవసరమైతే నెలలు కూడా వేచి చూడాలి. అయితే, ఓ బ్యాంక్‌ గ్యారెంటీ అంశానికి సంబంధించి బ్యాంక్‌కు ఈ–మెయిల్‌ పంపిన ఐదు నిమిషాల్లోనే జవాబు వచ్చేస్తే..? అలాంటి సత్వర స్పందనపై రాష్ట్ర ప్రభుత్వ అధికారికి వచి్చన సందేశంతోనే నకిలీ బ్యాంక్‌ గ్యారెంటీల స్కామ్‌ వెలుగులోకి వచి్చంది. ఈ కేసులో సిటీ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు ఇటీవల నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.45 కోట్ల విలువైన బోగస్‌ బ్యాంక్‌ గ్యారెంటీ లేఖలు స్వాధీనం చేసుకున్నారు. 

కోల్‌కతాలో ‘కుటీర పరిశ్రమగా’ఈ దందా... 
కోల్‌కతాలోని అనేక ప్రాంతాలు నకిలీ బ్యాంక్‌ గ్యారెంటీ పత్రాలు తయారు చేయడానికి అడ్డాలుగా ఉన్నాయి. చిన్న చిన్న కార్యాలయాలతో పాటు గదుల్లోనూ కుటీర పరిశ్రమగా, వ్యవస్థీకృతంగా ఈ దందా నడుస్తుంటుంది. వీరికి దేశ వ్యాప్తంగా ఏజెంట్లు ఉంటారు. వరంగల్‌కు చెందిన ఏజెంట్‌ నాగరాజు వారిలో ఒకడు. చెన్నైకి చెందిన హర్షిత ఇంజనీరింగ్‌ కంపెనీ రాష్ట్రంలో కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంది. వీటి కోసం హర్షిత సంస్థ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖకు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాల్సి వచ్చింది. వాటిని ఏర్పాటు చేస్తానంటూ ఈ కంపెనీ ఎండీని కలిసిన నాగరాజు కమీషన్‌ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. కంపెనీ నుంచి దాదాపు రూ.47 లక్షలు కమీషన్‌గా తీసుకున్న ఇతగాడు నకిలీ బ్యాంక్‌ గ్యారెంటీ లెటర్లు అందించాడు. 

పక్కాగా తయారు చేసిన కోల్‌కతా గ్యాంగ్‌..
ఏజెంట్‌గా వ్యవహరించిన నాగరాజుకు కొన్నేళ్ళ క్రితం రాజస్థాన్‌కు చెందిన నరేష్‌ వర్మ ద్వారా కోల్‌కతా వాసులు నీలోట్‌పాల్‌ దాస్, సుబ్రజిత్‌ గోశాల్‌లతో పరిచయమైంది. ఈ నలుగురూ కలసి గతంలో అనేక బ్యాంకులకు సంబంధించిన బ్యాంక్‌ గ్యారెంటీ పత్రాలు వివిధ కంపెనీలకు అందించారు. కాగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ పేరుతో తమకు అందినవి నకిలీవని తెలియని హర్షిత సంస్థ వాటిని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖకు దాఖలు చేసి పనులు కూడా పొందింది. నకిలీ బ్యాంకు గ్యారెంటీ పత్రాలు తయారు చేయడంలో నీలోట్, సుబ్రజిత్‌లు దిట్టలు కావడంతో వీటిపై ఎవరికీ అనుమానం రాలేదు. కాంట్రాక్టర్లు, కాంట్రాక్టులు పొందిన సంస్థల నుంచి ఈ బ్యాంకు గ్యారెంటీ పత్రాలు పొందే ప్రభుత్వ విభాగాలు సాధారణంగా క్రాస్‌ చెక్‌ చేయవు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ బ్యాంక్‌ను సంప్రదించి సందేహం నివృత్తి చేసుకుంటాయి.  

ఐదు నిమిషాల్లోనే సమాధానం రావడంతో..
ఈ ఉత్తరప్రత్యుత్తరాలు ఈ–మెయిల్‌ ద్వారా జరుగుతాయి. సదరు బ్యాంక్‌ గ్యారెంటీ లేఖలోనే ఈ మెయిల్‌ ఐడీ కూడా ఉంటుంది. ఈ విషయం తెలిసిన కోల్‌కతా ద్వయం దీనికోసం ప్రత్యేకంగా కొన్ని ఈ–మెయిల్‌ ఐడీలు కూడా రూపొందించింది. వీటిలో ఆయా బ్యాంకుల పేర్లు ఉండేలా, వాటిని చూసిన అధికారులు నిజమైనవిగానే భావించేలా జాగ్రత్తపడింది. హర్షిత సంస్థ ద్వారా అందుకున్న బ్యాంక్‌ గ్యారెంటీలను సరిచూడాలని భావించిన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగాధినేత అందులో ఉన్న ఈ–మెయిల్‌కి మెసేజ్‌ పంపించారు. దీన్ని అందుకున్న సుబ్రజిత్‌ గోశాల్‌ బ్యాంకు అధికారి మాదిరిగానే కేవలం ఐదు నిమిషాల్లోనే సమాధానంగా మెయిల్‌ పంపిస్తూ... అవి నిజమైనవేనని స్పష్టం చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఇంత త్వరగా సమాధానం రావడంతో షాక్‌కు గురైన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు అనుమానించారు.  

రీజినల్‌ కార్యాలయాన్ని సంప్రదించడంతో..
కోల్‌కతాలోని బ్రాంచ్‌ నుంచి వచి్చన జవాబుతో పాటు బ్యాంకు గ్యారెంటీ పత్రాలను మరోసారి సరిచూడాలని భావించారు. దీంతో వీటిని ముంబైలోని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రీజనల్‌ కార్యాలయానికి ఈ–మెయిల్‌ ద్వారా పంపించారు. వీటిని చూసిన అక్కడి అధికారుల షాక్‌కు గురయ్యారు. ఈ బ్యాంకు గ్యారెంటీ పత్రాల్లో పేర్కొన్న ప్రాంతంలో తమకు అసలు శాఖే లేదని స్పష్టం చేశారు. తమకు ఈ–మెయిల్‌ ఐడీలు కూడా ఉండవని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మాసబ్‌ట్యాంక్‌లోని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ శాఖకు రీజనల్‌ కార్యాలయం తెలిపింది. వీరి ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదై సీసీఎస్‌కు చేరింది. మరోపక్క హర్షిత సంస్థ కూడా నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమోదైన కేసూ అక్కడికే వచి్చంది. వీటిని దర్యాప్తు చేసిన అధికారులు మొత్తం నలుగురు నిందితులనూ అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు