వివాదంలో ఎస్సీ సంక్షేమ శాఖ! 

31 Aug, 2020 12:04 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: కక్ష సాధింపులు.. వేధింపులు.. వసూళ్లు.. ఈ మూడు అంశాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలను కుదిపేస్తున్నాయి. ఆయా శాఖలను వివాదాల్లోకి లాగుతున్నాయి. తరచూ అధికారులకు, హాస్టల్‌ వార్డెన్ల నడుమ ఏర్పడుతున్న గొడవలు రచ్చకెక్కుతున్నాయి. సంక్షేమ శాఖల పాలనను పక్కన పెట్టి పోటాపోటీగా కలెక్టర్‌కు, ఆయా శాఖల ఉన్నతాధికారులకు పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇంతటితో పోకుండా నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రత్యక్ష పంచాయితీలకూ కాలు దువ్వుతున్నారు. అయితే ప్రతీ చిన్న విషయానికి యూనియన్‌ నేతలను కలుపుకొని వివాదాలను రచ్చకెక్కిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇటు ఉన్నతాధికారులకు సైతం ఈ సంక్షేమ శాఖల గొడవలు విసుగు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం పాలన గాడి తప్పి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. 

ఐదారు నెలల క్రితం బీసీ సంక్షేమ శాఖలో ఓ అధికారికి, హాస్టల్‌ వార్డెన్ల  నడుమ చాలా సినిమానే నడిచింది. సదరు అధికారి తమ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇవ్వని వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని వార్డెన్లు కలెక్టర్‌తో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారికి కూడా ఫిర్యాదు చేశారు. ఇటు సదరు అధికారి కూడా వార్డెన్లపై పలు ఆరోపణలు చేశారు. అయితే, సదరు అధికారి ఉంటే తాము పని చేయలేమని, సెలవుల్లో వెళ్తామని వార్డెన్‌లు ముక్త కంఠంతో చెప్పాగా, ఓ ఉన్నతాధికారి ఎదుట విచారణ కూడా జరిగింది. కానీ చివరికి యూనియన్‌ నేతల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. కొన్ని వాస్తవాలున్నప్పటికీ ఎవరిపై ఎలాంటి చర్యలు లేకుండానే చివరికి కథ ముగిసింది. 

ట్రైబల్‌ వెల్ఫేర్‌లో.. 
జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో కూడా ఇటీవల ఓ ద్వితీయ శ్రేణి అధికారి తీరుతో వేగలేక పోయిన హాస్టల్‌ వార్డెన్లు, ఆ శాఖ ఉద్యోగులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. తమను వేధిస్తున్నారని, వసూళ్లకు పాల్పడుతున్నారని వార్డెన్లు, శాఖ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. గిరిజన సంక్షేమ శాఖకు మచ్చ తెస్తున్న సదరు ద్వితీయ శ్రేణి అధికారిని పిలిపించి ఓ ఉన్నతాధికారి మందలించారు. కానీ ప్రస్తుతం కూడా సదరు అధికారి తీరు విమర్శలకు దారి తీస్తోంది. 

ఇప్పుడు ఎస్సీ సంక్షేమ శాఖలో.. 
బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో అధికారులకు, వార్డెన్ల మధ్య వివాదాలను మరిచిపోక ముందే జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో కొత్త లొల్లి మొదలైంది. ఓ అధికారి తమను వేధిస్తున్నారంటూ కొంత మంది వార్డెన్లు యూనియన్‌ నాయకులతో కలిసి ఆ శాఖ అధికారితో పాటు కలెక్టర్‌కు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఇన్ని సంవత్సరాల పాటు ఆ అధికారితో కలిసి మెలిసి పని చేసిన వారే వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది. కావాలనే టార్గెట్‌ చేసి ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కూడా రచ్చకెక్కింది. 

వారిదే పెత్తనం.. 
మూడు సంక్షేమ శాఖలకు కలిపి నాయకులుగా పిలవబడే కొంత మంది తీరుతోనే ఆయా శాఖల పరువు బజారున పడుతోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏ అధికారైనా సరే తాము చెప్పినట్లు నడుచుకోవాలని, చెప్పిన పని చేయాలని ఆర్డర్లు వేసి మరీ పనులు చేయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఒక వేళ అడ్డు చెబితే ఇక సదరు అధికారి పని అంతేనని, కక్ష సాధింపులకు దిగుతారని, అవసరమైతే సరెండర్‌ చేయిస్తారనే పేరుంది. కాగా తమ వర్గానికి చెందిన, మచ్చిక చేసుకున్న అధికారులుంటే వారిపై ఎన్ని అవినీతి, ఆరోపణలున్నా సరే వారిని రక్షించడానికి ఎలాంటి పనికైనా సిద్ధపడుతారనే మాట ప్రచారంలో ఉంది. 

ఫిర్యాదు అందింది.. 
ఎస్సీ సంక్షేమ శాఖలోని ఓ అధికారిపై వార్డెన్ల సంఘ నాయకులు చేసిన ఫిర్యాదు నాకు అందింది. అయితే, ఈ వివాదం ఇరువురి మధ్య నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏది వాస్తవమో విచారణ జరిపి తేలుస్తాం. – రాములు, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి   

మరిన్ని వార్తలు