ఆపరేషన్‌ చేస్తే వీణా-వాణీలకు ముప్పు.. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

5 Feb, 2022 04:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవిభక్త కవలలు వీణా– వాణీలకు శస్త్ర చికిత్స చేసి విడదీసేందుకు విదేశాల నుంచి వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించామని.. శస్త్రచికిత్స చేస్తే వారి ప్రాణా లకు ప్రమాదం ఏర్పడవచ్చని వైద్యులు స్పష్టం చేశారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. దీంతో వీణా–వాణీల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు శస్త్రచికిత్స చేయించాలన్న ప్రయత్నాన్ని విరమించుకున్నామని తెలిపింది.

వీణా–వాణీలకు శస్త్రచికిత్స చేయాలని, వారికి హైదరాబాద్‌ లేదా వరంగల్‌లో నివాసం మంజూరు చేసేలా ఆదేశించాలంటూ హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ 2016లో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావలిల ధర్మాసనం శుక్ర వారం మరోసారి విచారించింది.భవిష్యత్తులో వారి వైద్య చికిత్సలకయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వివరించారు.

9 ఏళ్లుగా వారు ఆసుపత్రిలోనే ఉన్నారని, వారి యోగ క్షేమాలన్నీ ప్రభుత్వమే చూసిందని తెలిపారు. ఇద్దరూ ఇంటర్‌ చదువుతున్నారని వివరించారు. వీణా–వాణీల ఉన్నత చదువు, ఇతర ఖర్చులకు హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ నెలకు రూ.15 వేలు సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని ఫౌండేషన్‌ తరపు న్యాయవాది నివేదించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ను ధర్మాసనం అభినందించింది.

మరిన్ని వార్తలు