బస్‌స్టేషన్లలోని మరుగుదొడ్లలో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌: సజ్జనార్‌

10 Oct, 2022 02:16 IST|Sakshi
నెక్లెస్‌రోడ్డులో జరిగిన ప్యూరథాన్‌లో రాచకొండ కమిషనర్‌ మహేష్‌భగవత్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, గాయని గీతా మాధురి తదితరులు  

నవంబర్‌లోగా రాష్ట్రంలోని అన్ని బస్‌స్టాప్‌ల్లో సౌకర్యం: ఆర్టీసీ ఎండీ 

పీరియడ్స్‌ టైమ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నెక్లెస్‌రోడ్‌లో ప్యూరథాన్‌

ఖైరతాబాద్‌: గౌలిగూడ మహాత్మాగాంధీ, సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌ స్టేషన్ల లో ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు శానిటరీ ప్యాడ్‌ బాక్స్‌లు కూడా ఏర్పా టు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్‌ స్టేషన్లలో నవంబర్‌లోగా ఈ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. బాలికా విద్య, మహిళలు రుతు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ పీపుల్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌ (ప్యూర్‌) స్వచ్ఛంద సంస్థ ‘ప్యూరథాన్‌’ నిర్వహించింది.

నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వేదికగా ఆదివారం ఉదయం జరిగిన 2కె, 5కె రన్, వాక్‌ను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మహిళల్లో శానిటరీ ప్యాడ్స్‌ గురించి మరింత అవగాహన కల్పించాలని, ఇందుకోసం ఆర్టీసీ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.

కొందరు రుతుక్రమం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడతారని, ఇది ప్రకృతి సహజమైనదని అన్నారు. ప్యాడ్స్‌ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థినులు పాఠశాలల నుంచి డ్రాపవుట్‌ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుతుక్రమంపై ముఖ్యంగా మగవారిలో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్, సినీ నటుడు సత్యదేవ్‌ అన్నారు.

జ్వరం, జలుబు వస్తే ఎలా మెడికల్‌ షాప్‌కు వెళ్లి మందులు కొనుగోలు చేస్తారో అలాగే ప్యాడ్‌లను కొనుగోలు చేసేలా మహిళలు, యువతులు, బాలికల్లో ధైర్యం పెంచేందుకు ఈ పరుగును నిర్వహించినట్లు ప్యూర్‌ సంస్థ ఎండీ శైలా తాళ్లూరి తెలిపారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు రమేష్, సినీనటి దివి, మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి, గాయని గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు. మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా రన్‌లో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు