అవీ సర్కారు ఆసుపత్రులు.. ఆరోగ్యశ్రీ లేకుంటే.. వైద్యమూ అందట్లే!

25 Nov, 2022 04:40 IST|Sakshi

ఆమె పేరు శ్వేత (పేరు మార్చాం)... పది రోజుల క్రితం ప్రసవం కోసం నిలోఫర్‌ ఆసుపత్రికి వచ్చారు. ఆమెకు మగ బిడ్డ పుట్టాడు. డిశ్చార్జి సమయంలో మగబిడ్డ పుట్టినందున రూ.3 వేలు చెల్లించాలని అక్కడి సిబ్బంది ఒత్తిడి చేశారు. వైద్యాధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో రూ. 3 వేలు, ఇతరత్రా రూ.500 చెల్లించి బయటికొచ్చారు. 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రుల తీరుకు ఈ రెండు ఘటనలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రికి వచ్చిన రోగికి ఆరోగ్యశ్రీ కార్డు లేకుంటే గుండె వైద్యం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్‌పేషంట్లుగా చేరే రోగులకూ చాలాచోట్ల సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. రెండు మూడు రోజులు ఇన్‌పేషంట్‌గా ఉంటే సొమ్ములు ఇవ్వాల్సిందే. లేకుంటే వారికి వైద్యసేవలు గగనమే.

ఇలాంటి వాటిపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి, ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధమేంటని.. ఎవరికైనా ఉచిత వైద్యం చేయాల్సిందే కదాని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉచిత వైద్యం అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడుతున్నారు.

కోట్లలో వసూలు... 
సర్కారు ఆసుపత్రుల్లో ప్రసవానికి, ఇతర చికిత్సలకు ఒక్కో రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్న పరిస్థితులున్నాయి. విచిత్రమేంటంటే కొన్ని చోట్ల కేసీఆర్‌ కిట్టు ఇచ్చినందుకూ డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాంటి దందాల్లో కొందరు డాక్టర్లు సూత్రధారులుగా ఉంటున్నారని ఆరోపణలున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వసూలు చేసిన సొమ్మును డాక్టర్‌కు లేదా ఏజెన్సీ నిర్వాహకుడికి ఇచ్చి అంతా పంచుకుంటున్నారు. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో జరిగే కాసుల దందాతో ఏడాదికి రూ.కోట్లు వసూలు అవుతున్నాయి. నిలోఫర్‌లో ఏడాదికి రూ. 2 కోట్లు, గాం«దీలో రూ.కోటిన్నర, ఉస్మానియాలో రూ. కోటి వరకు వసూలు అవుతున్నట్లు అంచనా. జిల్లా ల్లోని పెద్ద ఆసుపత్రుల్లోనూ జోరుగా వసూళ్లపర్వం సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఏటా దాదాపు 6 లక్షల కాన్పులు జరుగుతుండగా, వీటిలో 4 లక్షల కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. 

డబ్బులు వస్తేనే చేయగలం!  
యాంజియోగ్రాం చేసేటప్పుడు అవసరమైతే స్టెంట్లు వేయాలని, వాటికి ఖర్చవుతుంది కాబట్టి ఆరోగ్యశ్రీ అడుగుతున్నామని వైద్యులంటున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అయితే స్టెంట్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని చెబుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలోనూ ఇదే పద్ధతి నడుస్తోంది. కాగా, ‘గాంధీ’లోని ఒక గైనకాలజీ వైద్యురాలు ఆపరేషన్‌కు రూ.10 వేలు డిమాండ్‌ చేశారని ఒక బాధితురాలు ఇటీవల లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. నిలోఫర్‌ ఆసుపత్రిలోనూ వసూలు దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రసవానికి వచి్చన మహిళ నుంచి ఆడబిడ్డ పుడితే రూ. 2 వేలు, మగబిడ్డ పుడితే రూ.3 వేలు ఇవ్వాలన్న షరతు పెట్టారు. ఈ దందా వెనుక ఒక ప్రముఖ వైద్యుడు కీలకంగా ఉండటం గమనార్హం.  

కాసుల కక్కుర్తిలో మచ్చుకు కొన్ని... 
గాంధీ ఆసుపత్రి గైనకాలజీ విభాగంలో ఆడబిడ్డ పుడితే రూ. వెయ్యి, మగబిడ్డ పుడితే రూ. 1,500 వసూలు చేస్తున్నారు.  
► పాతబస్తీలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రితోపాటు బేలాలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన వారి నుంచి అబ్బాయి పుడితే రూ.2 వేలు, ఆడపిల్ల పుడితే రూ.1,500 వసూలు చేస్తున్నారు. 
► హైదరాబాద్‌ సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే రూ.వెయ్యి, మగబిడ్డ పుడితే రూ. 2 వేలు డిమాండ్‌ చేస్తున్నారు.  
 నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడ బిడ్డ పుడితే రూ.వెయ్యి, మగ బిడ్డ పుడితే రూ.1,500 వసూలు చేస్తున్నారు. డెలివరీ తరువాత ఆయాలకు రూ. 500 ఇవ్వాల్సి వస్తోంది.  
 జనగామ జిల్లాలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడబిడ్డ పుడితే రూ.500, మగ బిడ్డ పుడితే రూ.వెయ్యి గుంజుతున్నారు. 
 ఎంజీఎం ఆస్పత్రికి సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ నుంచి ప్రభుత్వం మందులు సరఫరా చేస్తున్నా, అందుబాటులో లేని ఔషధాల కొనుగోలుకు బడ్జెట్‌ కేటాయించినప్పటికీ రోగులు ప్రైవేట్‌ దుకాణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఐదు రకాల మందులు రాస్తే కనీసం రెండు రకాల ఔషధాలు బయటి నుంచి కొనుగోలు చేయాల్సిందే. 

నాకు ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డ జన‍్మించాడు. గురువారం డిశ్చార్జి చేసేటప్పుడు అక్కడి సిబ్బంది రూ.వెయ్యి వసూలు చేశారు. అలాగే కేసీఆర్‌ కిట్టుకూ వంద రూపాయలు తీసుకున్నారు. 
- ఝాన్సీ, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు