Free water Scheme: ఆధార్‌ లింక్‌ త్వరపడండి, లేదంటే 9 నెలల బిల్లు మోతే!

10 Aug, 2021 08:11 IST|Sakshi

ఉచిత నీళ్ల పథకానికి  ఇప్పటికి 5.58 లక్షల దరఖాస్తులు 

ఆధార్‌ అనుసంధానం చేసుకోని వారు ఇంకా 4.19 లక్షలు 

ఈ నెల 15తో ముగియనున్న తుది గడువు 

మీటర్లు లేని నల్లాలు 4.07 లక్షలు.. 

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో ఉచిత మంచినీటి సరఫరా పథకానికి ఆధార్‌ నెంబర్‌ను అనుసంధానం చేసుకునే గడువు ఈ నెల 15తో ముగియనుంది. కానీ మహానగరం పరిధిలో ఇంకా 4.19 లక్షలమంది గృహ వినియోగదారులు తమ ఆధార్‌ నెంబరును నల్లా కనెక్షన్‌ నెంబరుతో అనుసంధానం చేసుకోకపోవడం గమనార్హం. వీరిలో అత్యధికంగా అపార్ట్‌మెంట్‌ వాసులే ఉన్నారు. మొత్తంగా జలమండలి పరిధిలో 9.77 లక్షల మేర గృహవినియోగ నల్లాలుండగా..ఇందులో ఇప్పటివరకు 5.58 లక్షల మంది ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.

కాగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పొందేందుకు ఆధార్‌ అనుసంధానంతోపాటు ప్రతీ నల్లాకు నీటి మీటరును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు సుమారు 5.70 లక్షలమంది నీటిమీటర్లను ఏర్పాటుచేసుకున్నారు. మరో 4.07 లక్షల నల్లాలకు నీటిమీటర్లు లేవని వాటర్‌బోర్డు పరిశీలనలో తేలింది. ఈ వారంలోగా ఆధార్‌ అనుసంధానం చేసుకోవడంతోపాటు నల్లాకు నీటిమీటరును ఏర్పాటుచేసుకోని పక్షంలో సదరు వినియోగదారులు ఏకంగా 9 నెలల నీటిబిల్లు చెల్లించాల్సి ఉంటుందని వాటర్‌బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం నీటిమీటర్లున్న వారు సైతం తమ నీటి మీటరు పనిచేస్తుందో లేదో తనిఖీచేసుకోవాలని సూచించింది. కాగా నగరంలోని అన్ని అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న ప్రతీ ఫ్లాట్‌ వినియోగదారులు తమ ఆధార్‌ను నల్లా కనెక్షన్‌ నెంబరుకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోని వారికి నీటిబిల్లును జారీచేస్తామని జలమండలి ప్రకటించింది. 

కాగానగరంలో అపార్ట్‌మెంట్ల వాసులు కోవిడ్,లాక్‌డౌన్, వర్క్‌ఫ్రం హోం కారణంగా స్వస్థలాలకు తరలి వెళ్లడం, ఇతర దేశాల్లో నివసించడం వెరసి ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి.  


అనుసంధానం ఇలా చేసుకోండి..
నల్లాకనెక్షన్‌ నెంబర్‌కు ఆధార్‌ అనుసంధానాన్ని డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.హైదరాబాద్‌వాటర్‌.జిఓవి.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి పూర్తి చేసుకోవడం లేదా సమీప మీ సేవా కేంద్రాలను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జలమండలి సూచించింది. ఇతర వివరాలకు 155313 జలమండలి కాల్‌సెంటర్‌ను సంప్రదించాలని కోరింది.   

మరిన్ని వార్తలు