9 లక్షల కుటుంబాలకు ఉచిత తాగునీరు 

13 Jan, 2021 03:50 IST|Sakshi
ఉచిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న కేటీఆర్‌

రూ.500 కోట్ల భారం పడుతున్నా.. ఉచితంగా

తాగునీరందిస్తున్నాం: కేటీఆర్‌ 

ఎస్పీఆర్‌హిల్స్‌లో ఉచిత మంచినీటి సరఫరా పథకం ప్రారంభం

రహమత్‌నగర్‌ (హైదరాబాద్‌): గ్రేటర్‌ పరిధిలో 9 లక్షల కుటుంబాలకు నెలకు 20 వేల లీటర్ల మేర స్వచ్ఛమైన తాగునీటిని ఉచితంగా అందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఉచిత సరఫరా ద్వారా ఏటా రూ.500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా.. పథకాన్ని అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌ రహమత్‌నగర్‌ డివిజన్‌ ఎస్పీఆర్‌హిల్స్‌లో ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్ధానిక లబ్ధిదారులకు జీరో బిల్లులు అందించారు.

అనంతరం సమా వేశంలో మాట్లాడుతూ.. రాజధానికి దాదాపు 200 కి.మీ. దూరం నుంచి కృష్ణా, గోదావరి జలాలను తరలించి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు శుద్ధిచేసి నగర ప్రజల తాగునీటి అవసరాలను ప్రభుత్వం తీరుస్తోందన్నారు. రాబో యే తరాలకు మంచినీటి సమస్య లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధంచేశారని తెలిపారు. ఎస్పీఆర్‌హిల్స్‌ రిజర్వాయర్‌కు రూ.8కోట్లు మంజూరు చేసి అద నపు నీటి నిల్వ సామర్థ్యం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్‌లో ఖాళీ స్థలంలో రజకులు, నాయీ బ్రాహ్మణులకు కేటాయించి నివాసాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

అంతకుముందు జలమండలి రూపొందించిన బ్రోచర్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనా«థ్, నాగేందర్, వివేక్, ముఠాగోపాల్, మున్సిపల్‌ పరిపాలన ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, ఎమ్మెల్సీ మల్లేశ్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్, కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డిలు పాల్గొన్నారు. 

 

మరిన్ని వార్తలు