తాగునీరు ఫ్రీ.. వచ్చే మే లేదా జూన్‌ నుంచి అమలు

4 Feb, 2021 03:03 IST|Sakshi

142 పట్టణాలకు విస్తరించనున్న ఉచిత నీటి సరఫరా

రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో అమలుకు ప్రణాళికలు

మున్సిపల్‌ ఎన్నికల తర్వాత అమలుకు యోచన

ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చే అవకాశం

జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే ప్రారంభమైన పథకం..

వచ్చే మే నెల లేదా జూన్‌ నుంచి అమలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 142 నగరాలు, పట్టణాల్లో ఉచిత తాగునీటి సరఫరా పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం, మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంటింటికీ నెలకు 20 వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చిన విష యం తెలిసిందే. రాష్ట్రంలోని మిగిలిన పురపాలికల్లో సైతం ఈ పథకాన్ని భవిష్యత్తులో అమలు చేస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొంది.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇంటింటికీ నెలకు 20 వేల లీటర్ల లోపు తాగునీటిని ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులతో పాటు విధివిధానాలను సైతం జారీ చేసింది. వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌లో గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం సహా తొమ్మిది పురపాలికలకు మలి విడత ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ ఎన్నికలు ముగిశాక జీహెచ్‌ఎంసీ తరహా.. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టే అవకాశాలున్నట్లు పురపాలక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. వీటికి సంబం ధించిన ఎన్నికల మేని ఫెస్టోలో ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారుల్లో చర్చ జరుగుతోంది. వచ్చే మే లేదా జూన్‌ నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం నామ మాత్రమే..
ప్రస్తుతం రాష్ట్రంలోని ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో విధంగా నల్లా చార్జీలను వసూలు చేస్తున్నారు. చాలా మున్సిపాలిటీల్లో నెలకు రూ.100 నల్లా చార్జీలు విధిస్తున్నారు. కొన్ని చిన్న పట్టణాల్లో నెలకు రూ.40, రూ.50, రూ.60 మాత్రమే వసూలు చేస్తున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు పెద్ద మున్సిపాలిటీల్లో రూ.150 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ మినహాయిస్తే, రాష్ట్రంలోని 142 పురపాలికల్లో ఏటా రూ.60 కోట్ల నల్లా చార్జీలు వసూలు కావాల్సి ఉండగా, రూ.30 కోట్లలోపే వసూలు అవుతున్నాయి.

తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ, మరమ్మతులు, ఇంటింటికి నీటి సరఫరా కోసం ఏటా రూ.600 కోట్లకు పైగా నిధులను పురపాలికలు ఖర్చు చేస్తున్నాయి. నల్లా చార్జీలు, నీటి సరఫరా ఖర్చుకు మధ్య లోటును రాష్ట్ర ప్రభుత్వం వివిధ గ్రాంట్ల రూపంలో ఇచ్చే నిధులతో పూడ్చుకుంటున్నాయి. అన్ని పట్టణాల్లో గృహాలకు ఉచిత తాగునీటిని సరఫరా చేస్తే, ఇందుకు సంబంధించిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుండటంతో పురపాలికలకు కొంత వరకు నష్టాలను పూడ్చుకునే అవకాశాలు ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

10 లక్షల గృహాలకు లబ్ధి..
జీహెచ్‌ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలోని ఇతర పాత 72 పురపాలికల్లో 6 లక్షలకు పైగా అధికారిక నల్లా కనెక్షన్లు ఉన్నాయి. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో మొత్తం పురపాలికల సంఖ్య 142కు పెరిగింది. కొత్త, పాత మున్సిపాలిటీలు కలుపుకొని మొత్తం అధికారిక నల్లాల కనెక్షన్ల సంఖ్య 10 లక్షల వరకు ఉంటుందని పురపాలక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అనుమతి లేని మరో 10 లక్షల అక్రమ నల్లా కనెక్షన్లు పురపాలికల్లో ఉంటాయని అంచనా. వీటిని క్రమబద్ధీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు క్షేత్ర స్థాయిలో రాజకీయ జోక్యంతో సాధ్యం కావట్లేదు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో ఉచిత తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తే 10 లక్షలకు పైగా గృహాలకు లబ్ధి కలుగుతుంది. అనధికార కనెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 20 లక్షలకు పెరగనుందని అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు