రోజుకో రూ.కోటి.. చేతులెత్తేశారు!

23 Jan, 2021 20:56 IST|Sakshi

ఏడాదిలో భారీగా పెరిగిన ఆర్టీసీ చమురు భారం..

2019 డిసెంబర్‌తో పోలిస్తే ఇప్పుడు నిత్యం రూ.1.05 కోట్లు ఎక్కువ

ఆ వ్యయాన్ని మరోసారి ప్రయాణికులపై మోపేందుకు ఏర్పాట్లు

2019 డిసెంబర్‌: లీటరు డీజిల్‌ ధర రూ.63... ఆర్టీసీ ఒకరోజు ఖర్చు: రూ.4.3 కోట్లు...; 2021 జనవరి: డీజిల్‌ లీటరు ధర రూ.79... ఆర్టీసీ ఒకరోజు ఖర్చు: 5.35 కోట్లు...; కేవలం ఏడాది తేడా.. ఇంధనం కోసం ఒకరోజు ఖర్చులో పెరిగిన మొత్తం ఏకంగా రూ.కోటి.. మూలిగే నక్కపై తాటిపండు పడటమంటే ఇదే.. అసలే తీవ్ర నష్టాలతో కుదేలై, బ్యాంకు అప్పులు, వాటిపై వడ్డీ గుట్టగా పేరుకుపోయి తీర్చే మార్గం లేక సతమతమవుతున్న తరుణంలో కోవిడ్‌ రూపంలో కష్టం వచ్చి పడింది. దీంతో బస్సు ఎక్కేవారు తగ్గి రోజువారీ ఆదాయం బాగా పడిపోవటంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఈ తరుణంలో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనటంతో ఆర్టీసీ నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ప్రస్తుతమున్న డీజిల్‌ ధర ప్రకారం.. ఏడాది క్రితం బస్సు చార్జీలు పెరిగిన సమయంలో ఉన్న డీజిల్‌ వ్యయం కంటే రోజుకు అదనపు వ్యయమే రూ.కోటిగా నమోదవుతోంది. ఇక ఈ ఖర్చును భరించలేమని ఆర్టీసీ చేతులెత్తేయటంతో ఆ భారం కాస్తా జనం జేబులపై పడేందుకు రంగం సిద్ధమవుతోంది.  
– సాక్షి, హైదరాబాద్‌  

మైలేజీలో మెరుగే.. 
ప్రస్తుతం దేశంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల మైలేజీ చాలా మెరుగ్గా ఉంది. వారం రోజుల క్రితమే ఈ విషయంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలంగాణ ఆర్టీసీకి పురస్కారం కూడా ప్రదానం చేసింది. ముంబై (బెస్ట్‌ సంస్థ) తర్వాత అంత మెరుగ్గా కిలోమీటర్‌ పర్‌ లీటర్‌ (కేఎంపీఎల్‌) మెరుగ్గా ఉంది. ఈ లెక్కన చూస్తే.. ఆర్టీసీ బస్సులు సగటున నిత్యం 35 లక్షల కి.మీ. తిరుగుతున్నాయి. తాజా మైలేజీ ప్రకారం రోజుకు 6.8 లక్షల లీటర్ల ఇంధనం ఖర్చవుతోంది. ప్రస్తుతమున్న ధర ప్రకారం నిత్యం రూ.5.35 కోట్లు ఖర్చవుతోంది.(చదవండి: ప్రొటీన్‌.. హైదరాబాద్.. మనమే టాప్‌‌!)

ఏడాదిలో ఎంత మార్పు.. 
2019 అక్టోబర్‌లో ఆర్టీసీలో రికార్డు స్థాయి సమ్మె జరిగింది. దీంతో ఆర్థికంగా సంస్థ కుదేలైంది. అప్పటికీ డీజిల్‌ లీటరు ధర రూ.63 ఉండటంతో ఆ భారాన్ని భరించలేమని సంస్థ చేతులెత్తేయటంతో ప్రభుత్వం చార్జీలు పెంచుకునేందుకు అనుమతించింది. దీంతో కి.మీ.కు 20 పైసలు చొప్పున టికెట్‌ ధరలు పెరిగాయి. కానీ ఏడాదిలో అనూహ్యంగా డీజిల్‌ ధర రాకెట్‌లా దూసుకుపోయింది. పెట్రోల్‌తో సమంగా నిలిచింది. దీంతో ఆర్టీసీ చమురు ఖర్చు రికార్డు స్థాయికి చేరింది. మళ్లీ ఏడాది క్రితం నాటి పరిస్థితే పునరావృతమైంది. అప్పట్లో చార్జీలు పెంచి సాలీనా ప్రయాణికులపై రూ.750 కోట్ల భారం మోపారు. డీజిల్‌ భారాన్ని వారి జేబు నుంచి కొల్లగొట్టారు. ఇప్పుడు కూడా ఆ భారాన్ని మరోసారి జనంపై మోపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది.

భారం మరింత పెరగనుందా? 
గత కొంతకాలంగా చమురు ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. గతేడాది కాలంలో చోటుచేసుకున్న పెరుగుదల వల్ల ప్రస్తుతానికి రోజువారీ అదనపు భారం రూ.కోటిగా ఉంది. డీజిల్‌ ధర ఇంకా పెరిగితే ఈ భారం కూడా మరింత పెరగనుంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రజలకు రవాణా వసతి కల్పిస్తున్నందున ఆర్టీసీ కొనే డీజిల్‌పై పన్నులు తగ్గిస్తే కొంత భారం తగ్గుతుందని రవాణా రంగ నిపుణులు చాలాకాలంగా సూచిస్తున్నారు. చివరకు ఆర్టీసీ రోడ్‌ సెస్‌లాంటి వాటిని చెల్లిస్తోంది. 

ఆర్టీసీకి డిస్కౌంట్‌కే..
ప్రస్తుతం మార్కెట్‌లో లభించే ఇంధనం ధరలతో పోలిస్తే ఆర్టీసీకి స్వల్ప తగ్గింపుతో లభిస్తోంది. ఒకేసారి కోట్ల లీటర్ల డీజిల్‌ను బల్క్‌గా కొంటున్నందున ఆయిల్‌ కార్పొరేషన్లు కొంత డిస్కౌంట్‌ను ఇస్తున్నాయి. అలా డిస్కౌంట్‌ వచ్చేలా చేసుకోవటం ఆర్టీసీ విజయ రహస్యమే. ఎవరు తక్కువ కోట్‌ చేస్తే ఆ సంస్థ నుంచే కొంటామంటూ కొంతకాలంగా ఆర్టీసీ డీజిల్‌ టెండర్లు పిలుస్తోంది. ఇందులో మూడు ప్రధాన కంపెనీలు పాల్గొంటున్నాయి. తక్కువ కోట్‌ చేసిన సంస్థకు వర్క్‌ ఆర్డర్‌ దక్కుతోంది. ఇలా ఆర్టీసీకి బయటి ధరతో పోలిస్తే లీటర్‌పై రూ.3 నుంచి రూ.4 మేర తక్కువ ఉంటోంది. కానీ.. డీజిల్‌ ధరలు పెరిగిన ప్రతీసారి అంతమేర కంపెనీలు కూడా ఆర్టీసీకి సరఫరా చేసే ఇంధనంపై ధర పెంచుతున్నాయి.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు