‘పాలమూరు’ రుణాలపై తర్జనభర్జన

22 Aug, 2021 04:17 IST|Sakshi

అనుమతి లేని ప్రాజెక్టుగా పేర్కొన్న కేంద్రం

దీనిపై వివరణ కోరిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

తాగునీటి పనులే చేపడుతున్నందున రుణాలకు ఇబ్బంది ఉండదన్న రాష్ట్రం

రుణాల విడుదల ప్రక్రియ కొనసాగించాలని వినతి

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తి పోతల పథకం పనుల పూర్తికి నిధుల కొరత వెంటాడుతోంది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన కృష్ణా బోర్డు గెజిట్‌ నోటిఫికేషన్‌లో ‘పాలమూరు’ను అనుమతిలేని ప్రాజెక్టుగా పేర్కొనడంతో నిధుల విడుదలపై రుణ సంస్థలు, రుణాల సాధనకు ఇరిగేషన్‌ శాఖ తర్జనభర్జన పడుతున్నాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) తో చర్చలు జరిపిన ఇరిగేషన్‌ శాఖ... నిధుల విడుదలకు ఆటంకాలు లేకుండా చూడాలని కోరగా దీని పై స్పష్టత వస్తే తప్ప ముందుకెళ్లలేమని పీఎఫ్‌సీ తేల్చిచెబుతుండటంతో సందిగ్ధత కొనసాగుతోంది. 

మరో రూ. 2,183 కోట్లు బ్యాలెన్స్‌.. 
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రూ. 32,200 కోట్ల అంచనా వ్యయంతో 2016–17లో చేపట్టగా ప్రస్తుతం దీని అంచనా వ్యయం రూ. 50 వేల కోట్లకు చేరుతోంది. భారీ నిధుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టులోని నార్లాపూర్‌ నుంచి కనీసం ఒక టీఎంసీని ఉద్ధండాపూర్‌ రిజర్వాయర్‌ వరకు తరలించేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీనికైనా రూ. 30 వేల కోట్ల మేర నిధుల అవసరాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా పాలమూరు–రంగారెడ్డికి సైతం రూ. 6,160.46 కోట్ల రుణాలను పీఎఫ్‌సీ నుంచే తీసుకొనేలా ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఇప్పటికే రూ. 3,976.98 కోట్ల మేర రుణాలను పీఎఫ్‌సీ విడుదల చేసింది. మరో రూ. 2,183.48 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ నేపథ్యంలో రుణాల విడుదలను పీఎఫ్‌సీ నిలిపివేసింది. 

అన్ని అనుమతులున్నాయంటూ రాష్ట్రం లేఖ..
రుణాల విడుదల కోరుతూ తెలంగాణ ప్రభు త్వం పీఎఫ్‌సీకి రెండ్రోజుల కిందట లేఖ రాసిన ట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ప్రాజె క్టు పనులను ప్రస్తుతానికి తాగునీటి అవసరాలు తీర్చేలాగానే చేపడుతున్నామని, ఇందుకు అను మతులు అవసరం లేదని చెప్పినట్లు సమాచా రం. గతంలో  జాతీయ హరిత ట్రిబ్యునల్‌ సైతం తాగునీటి వరకు పనులు చేపట్టుకోవచ్చని, పర్యావరణ అనుమతులు వచ్చాకే సాగునీటి పనులు చేపట్టాలని పేర్కొన్న విషయాన్ని పీఎఫ్‌సీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతులు సాధించే దిశగా చర్యలు మొదలుపెట్టామని, ఆ తర్వాతే సాగు నీటి కాల్వల నిర్మాణ పనులు చేపడతామని వివరించింది. ఈ దృష్ట్యా తాగునీటిని సరఫరా చేసే లా చేపట్టిన ఎలక్ట్రో మెకానికల్, పంపులు, మో టార్ల పనుల కొనసాగింపునకు వీలుగా రుణా లను విడుదల చేయాలని కోరినట్లు తెలిసింది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు