ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌కు నిధుల్లేక సుస్తీ

25 Dec, 2022 01:30 IST|Sakshi

సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఆదుకునే ఉద్దేశానికి గండి 

రూ.వంద కోట్ల కార్పస్‌ ఫండ్‌ సేకరణకు ఇబ్బందులు 

ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.20 కోట్లు 

కేంద్రం నుంచి రూ.50 కోట్లు ఆశించినా వచ్చింది శూన్యం  

సాక్షి, హైదరాబాద్‌: నష్టాల అంచులో ఉన్న సూక్ష్మ, చిన్నపరిశ్రమలను ఆదుకుని వాటి కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం 2018లో ‘ది తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌’(టీఐహెచ్‌సీఎల్‌)ను ఏర్పాటు చేసింది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)గా ప్రస్థానం ప్రారంభించిన హెల్త్‌ క్లినిక్‌ నిధుల కొరత ఎదుర్కొంటోంది.

రూ.100 కోట్ల కార్పస్‌ ఫండ్‌తో హెల్త్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా పదోవంతు అనగా రూ.10 కోట్లు విడుదల చేసింది. కేంద్రం నుంచి మరో రూ.50 కోట్లు, ఎంఎస్‌ఎంఈలు, బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల నుంచి రూ.40 కోట్లు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతలో రూ.10 కోట్లు విడుదల చేసినా కేంద్రం నుంచి నయాపైసా రాలేదు. మరోవైపు బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల నుంచి కూడా స్పందన శూన్యం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మరో రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ కొద్ది నిధులతోనే ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ నష్టాల అంచులో ఉన్న పరిశ్రమలకు కన్సల్టింగ్, కౌన్సెలింగ్, మార్గదర్శనం వంటి సేవలను అందిస్తోంది.  

నిధుల సేకరణ కోసం ప్రయత్నాలు 
పారిశ్రామికంగా శరవేగంగా పురోగమిస్తున్న తెలంగాణలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉద్యమ పోర్టల్‌ వివరాల ప్రకారం రాష్ట్రంలో 3.25 లక్షల సూక్ష్మ, చిన్న పరిశ్రమలు నమోదయ్యాయి. అయితే కరోనా పరిస్థితుల్లో అనేక సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పెట్టుబడి వ్యయం(వర్కింగ్‌ క్యాపిటల్‌) దొరక్కపోవడం, ఇతరత్రా కారణాలతో నష్టాల బాటపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో నష్టాల అంచులో ఉన్న సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ను ఆశ్రయిస్తున్నా నిధుల కొరతమూలంగా ఆశించిన సాయం అందడంలేదు. ఈ నేపథ్యంలో జపాన్‌ ప్రభుత్వ ఆర్థిక సంస్థ ‘జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ’(జికా)తో రుణ వితరణ ఒప్పందం కోసం ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ ప్రయత్నిస్తోంది.

మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే ‘స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’(సిడ్బి)తో కూడా సంప్రదింపులు చేస్తోంది. ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ కార్యకలాపాలు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు నష్టాల అంచులో ఉన్న 45 పరిశ్రమలకు రూ.5.50 కోట్ల మేర ఆర్థిక సాయం లభించింది. నష్టాల అంచులో ఉన్న మరో 430 వరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేసినట్లు సమాచారం.

ఆదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నం
ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ కార్పస్‌ ఫండ్‌ కోసం ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం. నష్టాల అంచు లో ఉన్న పరిశ్రమల వివరాలను బ్యాంకర్ల ద్వారా సేక రించడంతోపాటు సర్వేల ద్వారా కూడా గుర్తిస్తున్నాం. అయితే చాలా పరిశ్రమలు మూసివేతకు గురైన తర్వాతే యాజమాన్యాలు మా దగ్గరకు వస్తున్నాయి. ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ కార్యకలాపాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత వర్గాలను కోరాం.
– వెంకటేశ్వర్లు శిష్లా్ట, సీఈవో, ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌  

మరిన్ని వార్తలు