గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌..!  ఆ పది మంది ఎవరు?

15 Nov, 2021 04:42 IST|Sakshi

మృతుల్లో 16 మందిని గుర్తించిన పోలీసులు.. 

మిగిలిన పది మంది ఎవరు?  

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యార్‌పట్టి అడవుల్లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మృతిచెందిన వారిలో 16 మందిని గుర్తించగా, మిగతా పది మంది ఎవరనేది చర్చనీయాంశమైంది. ఆ పది మందిలో తెలంగాణకు చెందిన వారున్నారా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో 26 మంది ప్రాణాలు మృతిచెందగా, 16 మందిని ఆదివారం గుర్తించిన విషయం తెలిసిందే. కాగా, దండకారణ్యంతో పాటు వివిధ ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్, కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్, బండి ప్రకాశ్, మైలారపు అడెల్లు, కంకణాల రాజిరెడ్డి, మాచర్ల ఏసోబు, కొంకటి వెంకట్‌ పనిచేస్తున్నారు.

నిజామాబాద్‌కు చెందిన పడకల్‌స్వామి ప్రస్తుతం గడ్చిరోలి అడవుల్లో ఫ్లటూన్‌ కమాండర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో గుర్తించని 10 మంది మావోయిస్టులు ఎవరనే చర్చ సాగుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో డిసెంబర్‌ 2 నుంచి వారం పాటు నిర్వహించే పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలపై మావోయిస్టు ఫ్లటూన్లు సమావేశమయ్యాయన్న పక్కా సమచారంతోనే పోలీసు బలగాలు శనివారం ఉదయం 6.30 గంటలకు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుందని అంటున్నారు.  

మరిన్ని వార్తలు