అమిత్‌ షాతో గద్దర్‌ భేటీ!

17 May, 2022 00:52 IST|Sakshi

సీల్డ్‌ కవర్‌ అందజేసిన ప్రజాగాయకుడు..

సర్వత్రా చర్చనీయాంశం 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ప్రజాగాయకుడు గద్దర్‌ భేటీ కావడం చర్చనీయాంశమైంది. తుక్కుగూడలో శనివారం బీజేపీ బహిరంగ సభ జరిగిన సందర్భంగా అమిత్‌ షాను గద్దర్‌ కలుసుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ భేటీకి కారణమేంటీ, అసలు అమిత్‌షాను ఆయన ఎందుకు కలుసుకున్నారనే అంశాలపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. అమిత్‌ షాకు గద్దర్‌ గోధుమరంగు సీల్డ్‌ కవర్‌ను అందజేసినట్టు బీజేపీ నాయకులు చెబుతున్నారు. తనపై పెట్టిన కేసులు ఎత్తేయాలని గద్దర్‌ కోరుతూ వాటికి సంబంధించిన వివరాలు, ఇతర సమాచారాన్ని ఆ కవర్‌లో ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది.

తుక్కుగూడలో బీజేపీ  సభ మొదలు కావడానికి ముందే వెనక వైపు నుంచి గద్దర్‌ సభావేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించినప్పుడు అక్కడున్న పోలీసులు ఆపేశారు. వేదికపై కూర్చునేవారి జాబితాలో ఆయన పేరు లేదని పేర్కొనడంతో కేంద్రమంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డిలను కలుసుకునేందుకు వచ్చానని గద్దర్‌ తెలిపారు. దీనిపై పోలీసులు బీజేపీ నాయకులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి వేదికకు వెనక వైపు అమిత్‌షా కోసం ఏర్పాటు చేసిన రెండు గ్రీన్‌రూంలలో ఒక దాంట్లో గద్దర్‌ను కూర్చోబెట్టారు. కొద్దిసేపటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వచ్చి గద్దర్‌తో పిచ్చాపాటిగా మాట్లాడుతుండగా వచ్చిన అమిత్‌షాను కలుసుకుని తాను ఫలానా అంటూ పరిచయం చేసుకున్నారు. 

అక్కడే ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఆయన గురించి తెలియజేశారు. అప్పుడే ఒక సీల్డ్‌ బ్రౌన్‌ కవర్‌ను కేంద్ర మంత్రి అమిత్‌ షాకు గద్దర్‌ అందజేయడంతో దానిని ఆయన తన వ్యక్తిగత కార్యదర్శికి అప్పగించారు.   

మరిన్ని వార్తలు