లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాగాయకుడు పోటీ? భట్టి ఆఫర్‌కు గద్దర్‌ సై అంటారా?

8 Sep, 2022 03:20 IST|Sakshi

లోక్‌సభకు పోటీచేసే విషయంలో సానుకూలంగా స్పందించిన గద్దర్‌ 

సీఎల్పీ నేత భట్టితో సమావేశం సందర్భంగా ఆసక్తికర పరిణామం

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యమ పాటలతో ప్రజాగాయకుడిగా గుర్తింపు పొందిన సామాజిక విప్లవకారుడు గద్దర్‌ అలియాస్‌ గుమ్మడి విఠల్‌రావు పార్లమెంట్‌ బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వామపక్ష, విప్లవ రాజకీయాల్లో కొనసాగిన ఆయన ఆలోచనా ధోరణి ఇటీవలికాలంలో మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆసక్తికర పరిణామం జరిగింది. పార్లమెంట్‌ కొత్త భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టేలా అసెంబ్లీలో తీర్మానం చేయించాలని కోరుతూ గద్దర్‌ బుధవారం సాయంత్రం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు.

గద్దర్‌ మాట్లాడుతూ.. రాహుల్‌ పాదయాత్ర తెలంగాణకు వచ్చినప్పుడు సమాచారమిస్తే తాను పాల్గొంటానని చెప్పారు. మరి యాత్రలో పాల్గొనాలంటే కాంగ్రెస్‌ పార్టీలో చేరాలా? అని ప్రశ్నించారు. వెంటనే స్పందించిన భట్టి.. కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని గద్దర్‌ను ఆహ్వానించారు. పార్టీలోకి రావడమే కాదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేయాలని కూడా కోరారు.

భట్టి ఆహ్వానానికి గద్దర్‌ తల ఊపుతూ సానుకూలంగా స్పందించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు పెద్దపల్లి స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని గద్దర్‌ను కోరారు. అంబేడ్కర్‌ పేరు పెట్టడంపై కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని గద్దర్‌కు భట్టి సూచించగా.. సీఎంను కలిసే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో తీర్మానం చేయించాలని భట్టిని కోరుతున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: ఇకపై వార్ వన్‌ సైడ్ కాదు.. 2024లో అంతా మారుతుంది

మరిన్ని వార్తలు