ఆరు లేన్లకు గ్రీన్‌సిగ్నల్‌

1 Apr, 2022 02:18 IST|Sakshi
కేంద్రమంత్రి గడ్కరీకి వినతిపత్రం ఇస్తున్న ఎంపీ ఉత్తమ్‌ 

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారన్న ఎంపీ ఉత్తమ్‌ 

హైదరాబాద్‌–విజయవాడ హైవే విస్తరణకు జీఎంఆర్‌ ఓకే

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే ఆరు లేన్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం నాలుగు లేన్లున్న ఈ ఎన్‌హెచ్‌–65ను వీలైనంత త్వరగా 6 లేన్ల రహదారిగా విస్తరించాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని గురువారం ఉత్తమ్‌ కలసి వినతిపత్రం అందించారు.

రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే ఈ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చడంలో ఆలస్యం కారణంగా ట్రాఫిక్‌ సమస్య లు ఎదురవుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన నిర్మాణం చేపట్టిన జీఎంఆర్‌ సంస్థ.. 247 కి.మీ. పొడవైన 4 లేన్‌ల ఈ ఎక్స్‌ప్రెస్‌వేను 2012 అక్టోబర్‌ లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని ఉత్తమ్‌ చెప్పారు. 

రెండు వారాల్లో ప్రక్రియ పూర్తిచేస్తాం.. 
‘జీఎంఆర్‌తో ఒప్పందం ప్రకారం.. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటైన ఈ రహదారిని ఆరు లేన్ల రహదారిగా మార్చే ప్రక్రియను 2024 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలి. అయితే అనేక కారణాలతో ట్రాఫిక్‌ తగ్గి ఆదాయమూ తగ్గిందని పరిహారం కోసం జీఎంఆర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని కేంద్రమంత్రి తెలిపారు. ఆరు లేన్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నేను, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. గడ్కరీ దృష్టికి పలుసార్లు తీసుకెళ్లాం.

ఈ కారణంగా ఇటీవల జీఎంఆర్‌ సంస్థతో కేంద్రమంత్రి చర్చలు జరిపారు. దీంతో కోర్టు వ్యాజ్యాన్ని ముగించి త్వరలో పనులు ప్రారంభించేందుకు జీఎంఆర్‌ అంగీకరించిందని గడ్కరీ తెలిపారు. మంత్రిత్వ శాఖలో అవసరమైన ప్రక్రియలను 2 వారాల్లో పూర్తి చేసి విస్తరణ పనులను త్వరగా ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు’అని వివరించారు. 2009లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైదరాబాద్‌–విజయవాడ హైవే 4 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా మంజూరైందని, ప్రస్తుతం ఎంపీగా 6 లేన్లుగా విస్తరించడంలో తనవంతు పాత్ర పోషించడం ఎంతో సంతృప్తినిస్తోందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. 

రూ.1,470 కోట్ల అంచనాతో పనులు.. 
తెలంగాణ, ఏపీలను కలిపే ఈ రహదారిపై రద్దీ కారణంగా 2007లో ఎక్స్‌ప్రెస్‌వేకు మంజూరు లభించింది. 25 ఏళ్లకు  బిడ్‌ను పొందిన జీఎంఆర్‌ సంస్థ 2009లో 4 లేన్ల పనులను ప్రారంభించింది. రూ. 1,470 కోట్ల అంచనా వ్యయంతో 2010, మార్చి 22న ప్రారంభమైన పనులు 2012లో పూర్తయ్యాయి.   

మరిన్ని వార్తలు