‘డర్టీ పిక్చర్‌’లో కొత్త కోణం! మహిళ ప్రమేయం లేకుండానే ఫొటో వైరల్‌ 

10 Nov, 2022 04:16 IST|Sakshi

పోలీసులను ఆశ్రయించిన సదరు మహిళ 

గద్వాలలో మహిళలపై ట్రాప్, బ్లాక్‌ మెయిలింగ్‌ ఉదంతంపై ప్రధాన పార్టీ అధిష్టానం ఆరా 

ముఖ్య నేతకు ఫోన్‌.. సీరియస్‌గా వార్నింగ్‌? 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  జోగుళాంబ గద్వాల జిల్లాలో మహిళలు, యువతులను ట్రాప్‌ చేసి, బ్లాక్‌ మెయిల్‌ చేసిన వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేని ఓ మహిళ ఫొటోను వైరల్‌ చేసిన విషయం బయటికి వచ్చింది. సదరు మహిళ దీనిపై బుధవారం ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తాను, తన కుటుంబం అంటే పడనివారు కావాలనే ఇలా సామాజిక మాధ్యమాల్లో ఫొటోను పోస్టు చేశారని వాపోయారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినవారిని శిక్షించాలని కోరారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

కీలక వ్యక్తులను తప్పిస్తున్నారనే ఆరోపణలు 
మహిళలపై ట్రాప్, బ్లాక్‌ మెయిలింగ్‌ ఉదంతంలో ఇప్పటివరకు గద్వాల పట్టణానికి చెందిన తిరుమలేశ్‌ అలియాస్‌ మహేశ్వర్‌రెడ్డితోపాటు నిఖిల్, వినోద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఓ పోలీస్‌ అధికారిపై బదిలీ వేటు వేశారు. అయితే ఈ వ్యవహారంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన యువ నాయకులు, కౌన్సిలర్లు, ఓ ముఖ్య నేత అనుచరుడు ఉన్నారని.. వారిని తప్పిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కీలక వ్యక్తులను అరెస్టు చేయాలంటూ.. బుధవారం ప్రజా, విద్యార్థి సంఘాలు, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌టీపీ, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం ఆధ్వర్యంలో గద్వాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేయాలని, అసలు నిందితులను అరెస్టు చేయాలని ఆందోళనకారులు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌లకు వినతిపత్రాలు అందజేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది. స్థానిక పోలీసులపై ఒత్తిళ్లు ఉన్నాయని, సిట్‌తో విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుందని డీజీపీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో పట్టణంలో సిట్‌ అధికారులు రహస్య విచారణ చేపట్టారంటూ రోజంతా హైడ్రామా నడవడం గమనార్హం. 

ముఖ్య నేతకు ఫోన్‌.. సీరియస్‌ వార్నింగ్‌? 
మహిళలపై ట్రాప్, బ్లాక్‌ మెయిలింగ్‌ ఘటన పరిణామాలపై ప్రధాన పార్టీకి చెందిన ముఖ్య నేతతో పార్టీ అధిష్టానం మాట్లాడినట్టు తెలిసింది. ముందుగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రి నుంచి అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరు ఉన్నారు? ఏం చేస్తున్నారనే వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాతే గద్వాలకు చెందిన ముఖ్యనేతతో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఎవరున్నా ఉపేక్షించొద్దని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్టు సమాచారం. పోలీసుల విచారణకు ఎలాంటి అడ్డంకులు సృష్టించొద్దని సూచించినట్టు తెలిసింది.
చదవండి: హనీట్రాప్‌ కేసులో సంచలనం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి లీలలు

మరిన్ని వార్తలు