అందరి కళ్లు బంజారాహిల్స్‌పైనే..

11 Feb, 2021 10:48 IST|Sakshi

మేయర్‌ ఎన్నికపై ఖైరతాబాద్‌ నియోజకవర్గ ప్రజల ఆసక్తి

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం కాసేపట్లో జరగనుంది. మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు కూడా అనంతరం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్‌ ఎవరన్నదానిపై సర్వత్రా చర్చలు జోరుగా సాగుతున్నాయి. అందరి దృష్టి బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌పైనే నిలిచింది. బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా రెండోసారి గెలిచిన గద్వాల్‌ విజయలక్ష్మికి మేయర్‌ పదవి వరించనుందనే వార్తలు గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గురువారం ఉదయం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ దాదాపు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.12లోని ఎన్‌బీటీనగర్‌లో ఆమె ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. కార్యకర్తలు, నేతల రాకపోకలతో కొత్త వాతావరణం కనిపిస్తోంది.


కార్పొరేటర్‌ తండ్రి టీఆర్‌ఎస్‌ సెక్రెటరీ జనరల్‌ కేకే కూడా ఢిల్లీకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. దీంతో మేయర్‌ పదవి దాదాపుగా గద్వాల్‌ విజయలక్ష్మినే వరిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఉత్కంఠకు తెర వేయాలంటే ఇంకొద్ది సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో అందరి కళ్లు బంజారాహిల్స్‌పైనే కేంద్రీకృతమయ్యాయి. దాదాపుగా గద్వాల్‌ విజయలక్ష్మి పేరు సీల్డ్‌ కవర్లోకి ఎక్కిందని ప్రచారం జరుగుతుంది. ఆమె మేయర్‌గా ఎన్నికైతే ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి మేయర్‌ పదవి దక్కిన వారిలో రెండోవారు అవుతారు. 1961లో ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్‌ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీఆర్‌ఎస్‌ డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డిను ఖరారు చేసినట్లు సమాచారం.



మరిన్ని వార్తలు