400 ఏళ్లనాటి చరిత్ర.. తిరుపతి వెంకన్నస్వామికి గద్వాల ఏరువాడ పంచెలు

30 Sep, 2021 07:55 IST|Sakshi

సాక్షి, గద్వాల: తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా పంపించే గద్వాల ఏరువాడ జోడు పంచెలు సిద్ధమయ్యాయి. గద్వాల సంస్థానాదీశుల కాలం నుంచి తిరుమల శ్రీవెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు ఏరువాడ జోడు పంచెలను ఏటా అందజేయడం సంప్రదాయం. గత 400 సంవత్సరాలుగా కొనసాగుతోంది ఈ ఆనవాయితీ. ఈసారి చేపట్టిన శ్రీవారి జోడు పంచెల నేత ఇటీవలే పూర్తయింది. ఐదుగురు చేనేత కార్మికులు 41 రోజులు నిష్టతో వీటిని తయారుచేశారు.
చదవండి: అక్టోబర్‌ 5న వీఐపీ బ్రేక్‌ దర్శనం లేదు: టీటీడీ

అక్టోబర్‌ 7 నుంచి 15వ తేదీ వరకు జరిగే దసరా బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీవారి అలంకరణలో జోడు పంచెలను ధరింపజేస్తారు.  గురువారం ఈ పంచెలను టీటీడీ అధికారులకు అందజేస్తామని పంచెల తయారీని పర్యవేక్షించిన మహం కాళి కరుణాకర్‌ తెలిపారు. ఏరువాడ పంచెలు 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల వెడల్పు అంచుతో ఉంటాయి. తుంగభద్ర, కృష్ణానదుల మధ్య గద్వాల ఉండడంతో వీటికి ఏరువాడ పంచెలు అనే పేరు వచ్చింది.
చదవండి: బ్రహ్మోత్సవాల నుంచి నడకదారిలో భక్తులకు అనుమతి

గద్వాల సంస్థానాధీశులు సీతారాంభూపాల్ తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఏరువాడ జోడు పంచెలు సమర్పించటం ఆనవాయితీ. అదే సంప్రదాయం వారి వంశీయులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత గద్వాల్ సంస్థానం వారసురాలిగా ఉన్న శ్రీలతాభూపాల్‌ ఆధ్వర్యంలో జోడు పంచెలను శ్రీవారికి పంపే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు