స్వచ్ఛ గ్రామంగా మెట్లచిట్టాపూర్‌ 

24 Feb, 2021 16:51 IST|Sakshi

ట్విట్టర్‌లో ప్రశంసించిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌   

సాక్షి, జగిత్యాల: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగమైన ఓడీఎఫ్‌ ప్లస్‌ స్టేటస్‌కు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌ గ్రామం అర్హత సాధించింది. గ్రామపంచాయతీ కొత్త పాలకవర్గం ఏర్పడ్డ రెండేళ్లలోనే ఈ ఘనత సాధించిన మెట్లచిట్టాపూర్‌ గ్రామాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ట్విట్టర్‌లో అభినందించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ గ్రామం నూరుశాతం అమలు చేయడంతో ఓడీఎఫ్‌ (ఓపెన్‌ డెఫికేషన్‌ ఫ్రీ) ప్లస్‌ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


  
చెత్త నిర్వహణలో మేటి 
మెట్లచిట్టాపూర్‌ గ్రామంలో 1,975 మంది జనాభా, 719 నివాసాలు ఉండగా, ఇక్కడ నూరుశాతం స్వచ్ఛ కార్యక్రమాలను అవలంబిస్తున్నారు. ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ, వర్మీ కంపోస్ట్‌ తయారీ ద్వారా రైతులు మొక్కలకు సేంద్రియ ఎరువును అందిస్తున్నారు. జంతువులు చనిపోయినప్పుడు వాటి కళేబరాలతో వాతావరణం, నీరు కలుషితం కాకుండా గ్రామంలో జంతువుల కోసం ప్రత్యేకంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం విశేషం. లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మురుగునీరు నిలిచిపోకుండా మ్యాజికల్‌ ఇంకుడు గుంతలను నిర్మించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణంతో పాటు గ్రామానికి వచ్చే సందర్శకుల కోసం కమ్యూనిటీ టాయిలెట్స్‌ నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో ఈ గ్రామం స్వచ్ఛ సుందర్‌ సముదాయక సౌచాలయ కింద ఓడీఎఫ్‌ గ్రామంగా ఎంపికైంది.  

గ్రామస్తుల సమష్టి సహకారంతోనే..
గ్రామ పాలకవర్గం చేసిన తీర్మానాలకు గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు. అందరి సహకారంతోనే సామూహిక మరుగుదొడ్లు, కంపోస్ట్‌ యూనిట్లను నిర్మించాం. బహిరంగంగా చెత్త వేయకుండా, ప్లాస్టిక్‌ వినియోగించకుండా గ్రామస్తులు సహకరిస్తున్నారు.     
– బద్దం శేఖర్‌రెడ్డి, సర్పంచ్, మెట్లచిట్టాపూర్‌   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు