అసంతృప్తి ‘దండోరా’

20 Aug, 2021 04:35 IST|Sakshi

టీపీసీసీ చీఫ్‌ వ్యవహార శైలిపై పలువురు కాంగ్రెస్‌ సీనియర్ల గుర్రు

రేవంత్‌ గైర్హాజరీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సమక్షంలో గళం విప్పిన నేతలు

దండోరా సభల నిర్వహణ ఏకపక్షంగా సాగుతోందని విమర్శ

అందర్నీ భాగస్వాముల్ని చేస్తున్నామన్న రేవంత్‌ బృందం

24న గజ్వేల్‌ దండోరా సభ వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో అసంతృప్తి దండోరా’ మోగింది. టీపీసీసీ కార్యవర్గ సమావేశం వేదికగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ సమక్షంలోనే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై పలువురు సీనియర్లు గళమెత్తినట్టు సమాచారం. గురువారం గాంధీభవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశానికి మాణిక్యం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజుతో పాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్లు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి టీం తీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

ముఖ్యంగా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల నిర్వహణ ఏకపక్షంగా జరుగుతోం దని, తమను భాగస్వాములను చేయడం లేదని ఫిర్యాదు చేశారు. పార్టీలో వ్యక్తిగత ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారని, ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం చేస్తాయని వ్యాఖ్యానించారు. ఇకపై అందరితో చర్చించిన తర్వాతే ఈ సభల నిర్వహణ ప్రకటించాలని, సభల నిర్వహణలోనూ అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న గజ్వేల్‌లో జరగాల్సిన సభను వాయిదా వేయడం గమనార్హం. కాగా అదే రోజున మేడ్చల్‌లో 48 గంటల దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. 

కోవర్టులెవరు? 
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పార్టీలో కోవర్టు రాజకీయాలు చేయవద్దని, అలాంటి వారు పార్టీ వదిలి వెళ్లిపోతే మంచిదని రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఇంటి దొంగలున్నారనే రీతిలో రేవంత్‌ చేసిన కామెంట్లు ఎలాంటి సంకేతాలిచ్చాయో అర్థం చేసుకోవాలని ఒకరిద్దరు సీనియర్లు అన్నట్టు తెలిసింది. నిజంగా అలాంటి వారు పార్టీలో ఉంటే గుర్తించి చర్యలు తీసుకోవాలని, కోవర్టులున్నారని బహిరంగంగా వ్యాఖ్యానించడం మంచిది కాదని వారు పేర్కొన్నారు. 

అందరితో చర్చించే నిర్ణయాలు
సీనియర్లు లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ రేవంత్‌ టీం కూడా సమావేశంలో ధీటుగానే కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. రేవంత్‌కు మొదటి నుంచీ తోడుగా ఉన్న సీనియర్‌ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ఇతర సీనియర్లు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గతంలో పార్టీ పరిస్థితికి, రేవంత్‌ వచ్చిన తర్వాత పరిస్థితిని బేరీజు వేసుకుని మాట్లాడాలన్నారు. అందరితో చర్చించే నిర్ణయాలు తీసుకుంటున్నామని, కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఇంకెన్నాళ్లు కుమ్ములాడుకుందామని ప్రశ్నించారు. మనం పోరాటం చేయాల్సింది టీఆర్‌ఎస్‌ పార్టీపై అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, చిన్న చిన్న సమస్యలుంటే మాట్లాడుకోవచ్చని అన్నారు. 

అధిష్టానానికి అన్నీ తెలుసు: మాణిక్యం
సీనియర్ల అభిప్రాయాలపై మాణిక్యం ఠాగూర్‌ స్పందిస్తూ టీపీసీసీలో ఏం జరుగుతోందో, పార్టీ నేతలు ఎవరేం చేస్తున్నారో అధిష్టానానికి అంతా తెలుసునని అన్నట్టు సమాచారం. ‘ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఏం లీకులిస్తున్నారో ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయి. క్రమశిక్షణ రాహిత్యం సహించే పరిస్థితుల్లో పార్టీ లేదు. అందరూ కలసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకు రావాలి..’అని సూచించినట్లు తెలిసింది. 

పీఏసీ భేటీలకు సీనియర్లను పిలవండి: జగ్గారెడ్డి
ప్రతి వారం జరిగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాలకు సీనియర్లను ఆహ్వానించాలని కోరుతూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి గురువారం రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశమయ్యింది. ఈ లేఖలో ఆయన ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్లు జానారెడ్డి, వీహెచ్, పొన్నాల లాంటి వారి పేర్లను ప్రస్తావించారు. పీఏసీ సమావేశాలకు వారిని కూడా పిలవాలని కోరారు. మొత్తం మీద రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఆయన గైర్‌హాజరీలో జరిగిన సమావేశంలో పార్టీలో అసంతృప్తి బహిర్గతం కావడం గాంధీభవన్‌ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.

24న మేడ్చల్‌లో 48 గంటల దీక్ష 
రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు అమలు చేయాలని, గిరిజనులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 24న మేడ్చల్‌లో 48 గంటల దీక్ష చేయనున్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు సంఘీభావంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దండోరా ముగింపు సభకు రాహుల్‌గాంధీ వస్తారని తెలిపారు. బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ప్రతి శనివారం జరిగే ముఖ్య నేతల సమావేశం యథాతథంగా కొనసాగుతుందన్నారు.   

మరిన్ని వార్తలు