సరుకు రవాణా హబ్‌గా గజ్వేల్‌

23 Mar, 2022 04:54 IST|Sakshi

త్వరలో గూడ్స్‌ రైళ్లు ప్రారంభించాలని రైల్వే జీఎంకు ప్రతిపాదన 

సిద్ధమైన గూడ్సు ప్లాట్‌ఫామ్‌

సాక్షి, హైదరాబాద్‌: గజ్వేల్‌ స్టేషన్‌ను సరుకు రవాణా హబ్‌గా మార్చాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది. ఈ మేరకు త్వరలో సరుకు రవాణా రైళ్లను ప్రారంభించాలని సంబంధిత విభాగం ప్రతిపాదించింది. ఈ ప్రాంతం నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించడంతోపాటు, ఎరువులను ఇతర ప్రాంతాల నుంచి గజ్వేల్‌కు చేరవేయాలని అధికారులు భావిస్తున్నారు. గజ్వేల్‌ స్టేషన్‌ వద్ద మొత్తం ఐదు లైన్లు ఉండగా, ఒక లైన్‌ను గూడ్సుకు కేటాయించారు.

ఇక్కడ 755 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో సరుకుల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ నిర్మించారు. ప్రయాణికుల రైళ్లు ప్రారంభించేందుకు అన్నీ సిద్ధంగా ఉన్నా, కోవిడ్‌ ఆంక్షలతో ఇంతకాలం ప్రారంభించలేదు. ఆంక్షలు సడలినా ఆ జాప్యం కొనసాగుతూనే ఉంది. సరుకు రవాణా రైలు అంశం జోన్‌ పరిధిలోనిది అయినందున, వెంటనే ప్రారంభించాలని అధికారులు కోరుతున్నారు.  

రైల్వే రవాణా ఖర్చు తక్కువ... 
గజ్వేల్‌ పరిసర ప్రాంతాల్లో, సిద్దిపేట వరకు విస్తారంగా సాగుభూములున్నాయి. వరి, మొక్కజొన్న, కూరగాయలు, పత్తి, మిరప లాంటివి బాగా పండుతున్నాయి. ఇక్కడి నుంచి సేకరించే ధాన్యా న్ని రోడ్డు మార్గాన వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పుడు వీటి తరలింపునకు రైళ్లను ప్రారంభిస్తే మంచి డిమాండ్‌ ఉంటుందని రైల్వే యంత్రాంగం నిర్ధారించింది. దీంతోపాటు పాలు కూడా సేకరించవచ్చని నిర్ణయించారు.

ఇక ఈ ప్రాంతంలో ఎరువుల వినియోగం ఎక్కువ. నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి లారీల ద్వారా ఎరువులు వస్తుంటాయి. రైళ్లను ప్రారంభిస్తే వాటి ద్వారానే ఎరువులను గజ్వేల్‌కు చేరవేసే వీలుంటుంది. లారీలతో పోలిస్తే రైళ్ల ద్వారా రవాణా ఖర్చు తక్కువే అయినందున వ్యాపారులు కూడా ముందుకొస్తారని అధికారులంటున్నారు. త్వరలోనే గజ్వేల్‌ నుంచి సరుకు రవాణా రైళ్లు ప్రారంభమవుతాయని వారు పేర్కొంటున్నారు.   
 

మరిన్ని వార్తలు