కరోనాతో గాంధీ భవన్‌ అటెండర్‌ షబ్బీర్‌ మృతి 

3 Jun, 2021 11:01 IST|Sakshi
రేవంత్‌ రెడ్డి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న షబ్బీర్‌ (ఫైల్‌)  

30 ఏళ్లకుపైగా గాంధీభవన్‌లో సేవలందించిన షబ్బీర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గాంధీభవన్‌లో 30 ఏళ్లకు పైగా పనిచేస్తోన్న అటెండర్‌ షబ్బీర్‌ కొద్దిరోజులుగా ఓ ఆస్పత్రిలో కోవిడ్‌ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమా ర్తెలు ఉన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలో, పీసీసీ అధ్యక్షులుగా డి.శ్రీనివాస్, ఎం.సత్యనారాయణరావు, కె.కేశవరావు, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు పనిచేసిన కాలంలోనూ షబ్బీర్‌ గాంధీభవన్‌లో పనిచేశారు.

పలువురు కేంద్ర,రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులకు ఆయన సుపరిచితులు. షబ్బీర్‌ మృతిపట్ల టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నాయకులు దాసోజు శ్రావణ్‌ తదితరులు గాంధీభవన్‌లో షబ్బీర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన తన పార్లమెంటు కార్యాలయాన్ని షబ్బీర్‌ చేతుల మీదుగానే ప్రారంభించడం విశేషం.
చదవండి: నాన్నా.. ఇక రావా..? మమ్మల్ని ఎవరు చూస్తారు?

>
మరిన్ని వార్తలు