‘సినిమా సర్జరీ’ వైద్యులకు చిరు అభినందన

27 Aug, 2022 03:56 IST|Sakshi

గాంధీ ఆస్పత్రికి పీఆర్‌వోను పంపించి వివరాలు తెలుసుకున్న వైనం

ఆస్పత్రిలో మహిళాఅభిమానికి రెండురోజుల్లో పరామర్శ

గాంధీఆస్పత్రి: ‘సినిమా చూపిస్తూ సర్జరీ చేసేశారు’శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్పందించారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఆ సర్జరీపై ఆయన ఆరా తీశారు. యాదాద్రి జిల్లాకు చెందిన మహిళారోగి­(60) మెదడులోంచి కణితిని తొలగించేందుకు గాంధీ ఆస్పత్రి వైద్యులు గురువారం అవేక్‌ క్రేనియా­టోమి సర్జరీ చేశారు.

ఈ సర్జరీ చేస్తున్నప్పుడు నిరంతరాయంగా ఆమెను స్పృహలో ఉంచేందుకు ‘నీకు ఏ హీరో అంటే ఇష్టం’అని వైద్యులు అడగగా నాగార్జున, చిరంజీవి అంటే ఇష్టమని చెప్పింది. చిరంజీవి నటించిన సినిమాల్లో ఏది ఇష్టమని అడిగితే ‘అడవిదొంగ’ఇష్టమని చెప్పడంతో ఆ సినిమాను ఆమెకు కంప్యూటర్‌ ట్యాబ్‌లో చూపిస్తూ వైద్యులు సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ‘సాక్షి’లో వచ్చిన ఈ కథనాన్ని చదివి అబ్బురపడిన చిరంజీవి తన పీఆర్‌వో ఆనంద్‌ను శుక్రవారం గాంధీ ఆస్పత్రికి పంపించారు.

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు, సర్జరీ చేసిన వైద్యులు, సర్జరీ జరిగిన మహిళను ఆనంద్‌ కలిశారు. తాను చిరంజీవి వీరాభిమానినని, ఆయన నటించిన అన్ని సినిమాలు చూస్తానని, ‘అడవిదొంగ’సినిమాలో చిరంజీవికి మాటలు రావని ఆమె చెప్పిన మాటలను పీఆర్‌వో వీడియో రికార్డింగ్‌ చేసి చిరంజీవికి వినిపించారు. ఆమె అభిమానానికి ఫిదా అయిన చిరంజీవి సర్జరీ చేసిన వైద్యులను అభినందించారు. మహిళారోగిని పరామర్శించేందుకు చిరంజీవి రెండురోజుల్లో గాంధీ ఆస్పత్రిని సందర్శిస్తారని పీఆర్‌వో సూపరింటెండెంట్‌కు చెప్పారు.

సర్జరీ చేసిన వైద్యులకు సన్మానం
అరుదైన సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్యులకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తన చాంబర్‌లో శుక్రవారం పుప్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. న్యూరోసర్జరీ విభాగాధిపతి శ్రీనివాస్, వైద్యులు ప్రతాప్‌కుమార్, నాగరాజు, శ్రీదేవి, సారయ్య, ప్రతీక్ష, టీజీజీడీఏ గాంధీ యూనిట్‌ అధ్యక్షుడు రాజేశ్వరరావు, ప్లాస్టిక్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌వోడీలు సుబోధ్‌కుమార్, వినయ్‌శేఖర్‌ తదతరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు