ఆర్‌సీటీ యూనిట్‌గా గాంధీ మెడికల్‌ కాలేజీ

31 Dec, 2021 05:08 IST|Sakshi

గాంధీఆస్పత్రి: రీజనల్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ యూనిట్‌ (ఆర్‌సీటీయు)గా గాంధీ మెడికల్‌ కాలేజీని ఎంపిక చేస్తూ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్‌ క్లినికల్‌ ట్రయల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ నెట్‌వర్క్‌(ఇంటెంట్‌)లో భాగంగా అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ క్లినికల్‌ ట్రయల్‌(ఏసీసీటీ), రీజనల్‌ క్లినికల్‌ ట్రయల్‌ యూనిట్‌(ఆర్‌సీటీయు), ఐసీఎంఆర్‌ సెంటర్‌ ఫర్‌ క్లినికల్‌ ట్రయల్‌(ఐసీసీటీ), స్పెషాలిటీ సెంటర్‌ ఫర్‌ క్లినికల్‌ ట్రయల్‌ (ఎస్‌సీసీటీ), నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌ ఫర్‌ క్లినికల్‌ ట్రయల్‌(కేపీసీటీ) వంటి ఐదు విభాగాల్లో దేశవ్యాప్తంగా పలు క్లినికల్‌ సెంటర్లను ఎంపిక చేసింది.

దక్షిణ భారతదేశంలో ఆర్‌సీటీయు విభాగంలో గాంధీ మెడికల్‌ కాలేజీని ఎంపిక చేస్తు ఆదేశాలు జారీ చేసింది. రీజనల్‌ క్లినికల్‌ ట్రయల్‌ యూనిట్‌గా ఐసీఎంఆర్‌ గుర్తించడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో గాంధీ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రులను అభివృద్ధి చేసినందువల్లే ఇది సాధ్యమైందన్నారు. దీనివల్ల తెలంగాణ వైద్యులు, వైద్యవిద్యార్థులకు సైంటిఫిక్‌ స్టడీస్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ అందిపుచ్చుకునేందుకు అవకాశాలు పెరుగుతాయని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గాంధీ మెడికల్‌ కాలేజీ మైక్రోబయోలజీ విభాగంలో ఇటీవల వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ యూనిట్‌ ఏర్పాటుతో మరిన్ని పరిశోధనలకు వెసులుబాటు కలుగుతుందని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరక్టర్, గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రమేష్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు