‘సాగర్‌’లో నిమజ్జనానికి అనుమతిస్తారా? 

6 Aug, 2021 03:33 IST|Sakshi

కరోనా విపత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి 

సర్కారుకు హైకోర్టుకు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతి ఇస్తున్నారా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా పూర్తిగా పోలేదని, మూడో దశలో భాగంగా ఎప్పుడైనా ఉప్పెనలా విరుచుకుపడే అవకాశం ఉందని, అందువల్ల అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి శాశ్వతంగా అనుమతి ఇవ్వరాదని, గతంలో ఇదే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.

హుస్సేన్‌సాగర్‌లో ఎన్ని విగ్రహాలను నిమజ్జనం చేస్తారని ప్రభుత్వం తరఫున హాజరైన స్పెషల్‌ జీపీ హరీందర్‌ ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది అనుమతి ఇవ్వలేదని, ఈ ఏడాది అనుమతి ఇచ్చేదీ లేనిదీ తెలుసుకొని చెబుతానని నివేదించారు. ‘హుస్సేన్‌సాగర్‌లోని నీటిని పరిశుభ్రంగా ఉంచాలి. పరిసరాలను పర్యాటక ప్రదేశంగా అందంగా తీర్చిదిద్దాలి. అప్పుడే పర్యాటకులు ఆకర్షితులవుతారు. ప్రతి ఏడాది హుస్సేన్‌సాగర్‌లో వేల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవుతుంది. నగరం నడిబొడ్డున ఉన్న సాగర్‌ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విగ్రహాలను నిమజ్జనం చేయాలా వద్దా అన్నదానిపై ప్రభుత్వం ప్రతి ఏడాది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోకుండా శాశ్వతంగా నిర్ణయం తీసుకోవాలి’అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేసేందుకు వీలుగా తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు