గణేశుడి నిమజ్జనంలో అపశ్రుతి

10 Sep, 2022 10:08 IST|Sakshi
సూర్య (ఫైల్‌) నాగు (ఫైల్‌)

సాక్షి, సూర్యాపేట: గణేశుడి నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని కోటినాయక్‌ తండాలోని ఎస్సారెస్పీ కాల్వలో శుక్రవారం వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతిచెందగా.. మరొకరి ఆచూకీ లభ్యం కాలేదు. తండాలో ప్రతిష్టించిన గణేశ్‌ విగ్రహానికి ప్రజలు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం తండా శివారులోని ఎస్సారెస్పీ కాలువ 71 డీబీఎం 36ఎల్‌ వద్ద నిమజ్జనానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో తండాకు చెందిన బానోత్‌ సూర్య(55) కాల్వలోని మెట్లు దిగుతూ కాలుజారి నీళ్లలో పడ్డాడు.

నీటి ప్రవాహానికి సూర్య కొట్టుకుపోతుండగా అతడిని రక్షించేందుకు ఆయన అన్న కుమారుడు బానోత్‌ నాగు(36) నీళ్లలోకి దూకాడు. నిమజ్జనం చేసేచోట కాలువ రెండుగా విడిపోతుండడంతో గేట్ల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు రెప్పపాటులోనే గల్లంతయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపుల చర్యలు చేపట్టారు. రాత్రి ఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో సూర్య మృతదేహం లభ్యం అయింది. కానీ బానోత్‌ నాగు ఆచూకీ తెలియాల్సి ఉంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, సీఐ ఆంజనేయులు సందర్శించి గాలింపు చర్యలను పర్యవేక్షించారు.

మరిన్ని వార్తలు