ఆవు పేడతో వినాయక విగ్రహాలు 

23 Aug, 2022 03:28 IST|Sakshi

పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు 

300 రకాల ఉత్పత్తులు 

బోడుప్పల్‌: జీవ జాతులకు హాని కలుగకుండా... పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఆవు పేడతో గణపతి విగ్రహాలను తయారు చేస్తూ ఆయా విగ్రహాలను లాభాపేక్ష లేకుండా విక్రయిస్తోంది బోడుప్పల్‌ బాలాజీహిల్స్‌ కాలనీలోని శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్‌ ట్రస్ట్‌. 

ఆవు పేడతో 300 రకాల ఉత్పత్తులు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సంస్థ నిర్వాహకుడు కుప్ప శ్రీనివాస్‌ తెలిపారు. వినాయక విగ్రహాలు, గోడకు వేలాడ దీసే బొమ్మలు, ఇంటి ముఖ ద్వార తోరణాలు, ఆది యోగి విగ్రహాలు, శివలింగాలు, జ్ఞాపికలు, నర్సరీ కుండీలు, విత్తన గోలీలు, దీపావళికి లక్ష్మీదేవి విగ్రహాలు, ప్రమిదలు, జప మాలలు, ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు పెన్ను స్టాండ్‌లు, సెల్‌ఫోన్‌ స్టాండులు, విభూది, దంత మంజరి (పళ్లపొడి), తయారు చేస్తున్నారు. అలాగే గో మూత్రంతో పినాయిల్, వేప, హ్యాండ్‌వాచ్‌ల లాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. భవిష్యత్‌లో ఆవు పేడతో చెప్పులు తయారీ, ఆసనాల కోసం వేసుకునే పీటలు, దూబ్‌బత్తి, దోమల కోసం మచ్చల బత్తి వంటి ఉత్పతులు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

గోశాలకు విరాళాలు అందజేసే వారికి పేడతో తయారు చేస్తున్న ఉత్పత్తులను ఉచితంగా అందజేస్తున్నామని సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్‌ తెలిపారు. భావితరాలకు గో జాతిని వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 

మరిన్ని వార్తలు