మహిమగల చెంబు కొంటున్నట్లు తెలిసింది.. ఎక్కువ ధరకు కొంటానంటూ..

28 May, 2022 18:39 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : మహిమ గల చెంబు అంటూ ఓ ముఠా వ్యాపారిని బురిడీ కొట్టించి రూ.4.60లక్షలు కాజేసింది. ఈ ఘటన నీలగిరిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టుటౌన్‌ ఎస్‌ఐ రాజ శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీనారాయణ, నాగరాజు, మురళి, లక్ష్మణ్, సందుల రవి ఓ ముఠాగా ఏర్పడ్డారు. తమకు మహిమ గల చెంబు దొరిందని, దానిని తక్కువ ధరకు విక్రయిస్తామని పట్టణంలోని వ్యాపారి జి. శ్రీనివాస్‌ను ఫోన్‌లో సంప్రదించి నమ్మబలికారు. ఆ తర్వాత ముఠాలో ఒకరైన నాగరాజు తాను ఫ్లెమింగో కంపెనీ హైదరాబాద్‌ నుంచి మాట్లాడుతున్నాను.. మీరు మహిమ గల చెంబు కొంటున్నట్లు తెలిసిందని, దాన్ని నేను ఎక్కువ ధరకు కొంటానని చెప్పాడు.

ముఠాలోని మరో సభ్యుడు మా వాళ్లు చెంబు తక్కువ ధరకు ఇస్తారు.. ఆ తర్వాత ఎక్కువ ధరకు అమ్ముకో అని చెప్పారు. మల్లేపల్లికి డబ్బుతో రావాలని ముఠా సభ్యులు సూచించారు. దీంతో శ్రీనివాస్‌ 11న మల్లేపల్లికి వెళ్లి రూ.4.60లక్షలు చెల్లించి చెంబు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ముఠాలోని ఓ సభ్యుడు ఫోన్‌ చేసి చెంబు కొన్నట్లు తెలిసింది.. ఎక్కువ ధర ఇస్తాం హైదరాబాదుకు రావాలని చెప్పాడు. శ్రీనివాస్‌ అక్కడికి వెళ్లగా కొనుగోలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఫోన్‌ స్విచ్ఛాప్‌ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  
చదవండి: ద్యావుడా!.. పదకొండేళ్లకు కదిలిన అవినీతి చిట్టా

మరిన్ని వార్తలు