కాషాయ క్రమ‘శిక్ష’ణ షురూ!

3 Oct, 2020 08:53 IST|Sakshi
బీజేపీ నూతన జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి 

సాక్షి, కరీంనగర్‌: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర రథ సారథి బండి సంజయ్‌ సొంత జిల్లా నుంచే పార్టీని గాడిలో పెట్టే చర్యలకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్‌ పార్లమెంటు సభ్యునిగా ఉంటూనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్ద బాధ్యతలు మోస్తున్న సంజయ్‌ కరీంనగర్‌ కమలదళం నుంచే కొరడా ఝులిపించే పనిలో పడ్డారు. పార్టీ జిల్లా బాస్‌గా కీలక బాధ్యతల్లో ఉన్న నాయకుడు పార్టీలోకి కొత్తగా వచ్చిన ఓ మహిళ ట్రాప్‌లో చిక్కుకున్న వీడియో, ఆడియో గురువారం రాత్రి నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. వచ్చే నెలలో దుబ్బాక ఉప ఎన్నికకు పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా స్థానిక ఛానెల్‌ ద్వారా సోషల్‌ మీడియాలో వీడియో ప్రసారం కావడంపై బండి సంజయ్‌ సీరియస్‌ అయ్యారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం హుటాహుటిన పార్టీ ముఖ్య నాయకులతో ఫోన్‌లో చర్చించి, ప్రస్తుత పార్టీ అధ్యక్ష పదవి నుంచి బాస సత్యనారాయణను తొలగించారు. ఆ వెంటనే హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన గంగాడి కృష్ణారెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. ఒక్కరోజులో పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో నాయకులు, కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. 

ఉమ్మడి జిల్లాపైనే తొలి దృష్టి
పార్టీ జిల్లా అధ్యక్షున్ని తొలగించి వేరొకరికి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాను పూర్తిస్థాయిలో గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త స్థాయి నుంచి ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీలలో వివిధ స్థాయిల్లో పనిచేసిన సంజయ్‌కు ఉమ్మడి కరీంనగర్‌లో పార్టీ నాయకుల జాతకాలన్నీ తెలుసు. కరీంనగర్‌ నుంచి అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు కొందరు నాయకులు వ్యవహరించిన తీరుపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. సంజయ్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇతర జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నించారు. సొంత జిల్లా అంతర్గత వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించలేదు. కానీ ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తొలుత సొంత జిల్లాను ప్రక్షాళన చేసే విషయమై దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

అధ్యక్షుడే బాస్‌
బీజేపీలో పార్టీ అధ్యక్షుడే సుప్రీం. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మండల, గ్రామ అధ్యక్షుడి వరకు ఆయా స్థాయిలో కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఇటీవల ఉమ్మడి జిల్లాలో పార్టీ సీనియర్లు, ముఖ్య నాయకులు అని చెప్పుకునే వారు పార్టీ అధ్యక్షులతో సంబంధం లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కరీంనగర్‌ జిల్లాతోపాటు పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. దీనిపై అంతర్గత సమావేశాల్లో సంజయ్‌ అన్యపదేశంగా హెచ్చరికలు చేసినా, ఎవరికి వారే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. సంజయ్‌ కన్నా వయసులో పెద్దవాళ్లు, గతంలో పార్టీలో పలు హోదాల్లో పనిచేసిన వారు గ్రూపులు కడుతున్న వ్యవహారాలు కూడా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో సొంత జిల్లా(ఉమ్మడి కరీంనగర్‌) నుంచే క్రమశిక్షణ చర్యలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన నేపథ్యంలో కరీంనగర్‌కు చేరుకొని పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దే పనికి ఉపక్రమించనున్నట్లు తెలిసింది. 

బీజేపీ నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్‌ బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన న్యాయవాది గంగాడి కృష్ణారెడ్డి నియామకం అయ్యారు. వీణవంక మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని బీజేవైఎం, బీజేపీలలో వివిధ హోదాల్లో పనిచేశారు. కమలాపూర్‌ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌గా, జిల్లా కార్యదర్శిగా, మూడు సార్లు జిల్లా ఉపాధ్యక్షునిగా, బీజేపీ జిల్లా సంస్థాగత శిక్షణ కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 

పార్టీ బలోపేతానికి కృషి : గంగాడి కృష్ణారెడ్డి 
బీజేపీలో సామాన్య కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుందనేది మరోసారి రుజువైంది. నాపై ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహి స్తా. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.కింది స్థాయి కార్యకర్తలు కూడా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే తగిన గుర్తింపు లభిస్తుందని నాతో రుజువైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు. 

మరిన్ని వార్తలు