నయీం కుడి భుజం శేషన్న జాడేది..?

16 Dec, 2020 04:25 IST|Sakshi

నయీం హతమై నాలుగున్నరేళ్లయినా చిక్కని వైనం

అతడు దొరికితేనే ఆ ఆయుధాల గుట్టు వీడేది..

శేషన్నను కనిపెట్టడంలో ఘోరంగా విఫలమైన సిట్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఎన్‌కౌంటర్‌ సమయంలో నయీం దగ్గర దొరికిన ఏకే–47తో పాటు అతడి డెన్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాల గుట్టు వీడాలంటే శేషన్న దొరకాల్సిందే.. శేషన్న పట్టుకునే విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సైతం ఘోరంగా విఫలమైంది. నయీం హతమై నాలుగున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ నయీం యాక్షన్‌ టీమ్‌ ఇన్‌చార్జ్‌ ఆచూకీ లభించలేదంటే సిట్‌ పనితీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. అతడు చిక్కలేదా..? పోలీసులు పట్టుకోవట్లేదా..? అన్న విషయం స్పష్టం కావట్లేదు. మరోపక్క నయీం రాసిన డైరీల ఆచూకీ లభించకపోవడంలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి..

ఆ టీమ్‌ అత్యంత కీలకం.. 
షాద్‌నగర్‌ శివార్లలోని మిలీనియం టౌన్‌షిప్‌లో 2016 ఆగస్టు 8న జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయీం హతమయ్యాడు. ఇది జరిగిన నాటి నుంచి అతడి కేసుల్ని దర్యాప్తు చేసిన, చేస్తున్న పోలీసులు, సిట్‌ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా కేసులు నమోదు చేశారు. కేసుల కంటే ఎక్కువ సంఖ్యలోనే అతడి అనుచరుల్ని పట్టుకున్నారు. వీరంతా అప్పటివరకు తెరచాటుగా ఉంటూ నయీం ఆదేశాల మేరకు పని చేస్తూ వచ్చారు. భూ కబ్జాలకు పాల్పడటం, బెదిరింపుల ద్వారా వసూళ్లు, ల్యాండ్‌ సెటిల్‌మెంట్లలో కీలకపాత్ర పోషించడంతో పాటు నయీం ఆస్తులకు బినామీలుగా, ఆస్తిపత్రాలు, నగదు తదితరాలను దాచే డెన్లకు కేర్‌ టేకర్స్‌గా పని చేశారు. ఈ ముఠాకు భిన్నమైన యాక్షన్‌ టీమ్‌ ఒకటి నయీం కనుసన్నల్లో పనిచేసేది. వీరి పేర్లు, వ్యవహారాలు గతంలో అనేక సార్లు వెలుగులోకి వచ్చాయి. కరుడుగట్టిన నేరగాళ్లు, మాజీ మావోయిస్టులు, పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన, ఎక్కని వారితో కూడిన ఈ టీమ్‌ నల్లగొండ, హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో యాక్టివ్‌గా పనిచేసింది. అనేక కేసుల్లో వీరి ప్రస్తావన ఉంది.

ఆయుధాల గుట్టు వీడేనా? 
ఈ యాక్షన్‌ టీమ్‌ సాధారణ సమయంలో ఎవరి కంటపడేది కాదు. నయీం ఆదేశాల మేరకు నిర్దేశిత సమయంలో రంగంలోకి దిగడం.. హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడి ఆపై షెల్టర్‌ జోన్స్‌కు వెళ్లిపోవడం వీరి పని. ప్రతి కేసులోనూ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మరో టీమ్‌ సిద్ధంగా ఉండేది. నయీంకు చెందిన యాక్షన్‌ టీమ్‌ చేసిన ఏ నేరమైనా.. మేమే చేశామంటూ తమ మీద వేసుకునే ఈ టీమ్‌ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోతుండేవారు. ఈ నేపథ్యంలో ఆయా కేసుల్లో యాక్షన్‌ టీమ్‌కు చెందిన వారు కేవలం కుట్రదారులుగానే నమోదయ్యారు. అంతకాలం రాజ్యమేలిన ఈ యాక్షన్‌ టీమ్‌ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. నయీం వద్ద, అతడి డెన్లలోనూ దొరికిన భారీ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ విషయం నయీంతో పాటు యాక్షన్‌ టీమ్‌కు నేతృత్వం వహించిన శేషన్నకు మాత్రమే తెలిసే అవకాశముంది.
 
గాలించినా ఫలితం శూన్యం.. 
కేవలం ఆయుధాల సమాచారమే కాదు.. నయీం వ్యవహారంలో అనేక చిక్కుముడుల్ని విప్పగలిగేది శేషన్న మాత్రమే. నయీం ‘వారసత్వాన్ని’కొనసాగించే ప్రయత్నం ఆ యాక్షన్‌ టీమ్‌ చేయవచ్చని తొలినాళ్లలో పోలీసులు అనుమానించారు. నయీంకు చెందిన యాక్షన్‌ టీమ్‌లో ఏడుగురున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే మహబూబ్‌నగర్‌ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపి.. పటోళ్ల గోవవర్ధన్‌రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్ననే అత్యంత కీలకం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసు వర్గాలకు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలించాయి. ఓ దశలో శేషన్న పోలీసుల అదుపులోనే ఉన్నాడనే వార్తలు వచ్చినా.. ఎవరూ ధ్రువీకరించలేదు. ఈ గాలింపు మొదలై ఇప్పటికీ నాలుగున్నరేళ్లు కావస్తున్నా శేషన్న పోలీసులకు దొరకలేదు. గ్యాంగ్‌స్టర్‌నే పట్టుకున్న పోలీసులు అతడి కుడిభుజాన్ని పట్టుకోలేకపోవడం సిట్‌ పనితీరుపై సందేహాలకు తావిస్తోంది.  

డైరీలెన్ని? అవెక్కడ? 
సుదీర్ఘ కాలం మావోయిస్టులతో కలసి పనిచేసిన నయీంకు డైరీ రాసే అలవాటుంది. నయీం 2010 వరకు రాసిన డైరీలను సొహ్రబుద్దీన్‌ కేసు భయంతో తగలపెట్టాడని గతంలో చిక్కిన అతడి అనుచరుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఎన్‌కౌంటర్‌ జరిగే వరకు ప్రతి అంకాన్నీ నయీం తన డైరీల్లో రాసుకున్నాడు. ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఎక్కడెక్కడ సెటిల్‌మెంట్లు చేశాడు? ఆయా దందాల్లో ఎంత డబ్బు వచ్చింది? దాన్ని ఎవరెవరికి పంచాడు? ప్రధాన అనుచరులెవరు.. ఇలా ఎన్నో అంశాలు డైరీల్లో రాసినట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌ తర్వాత షాద్‌నగర్‌తో పాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉన్న డెన్ల నుంచి పోలీసులు డైరీలు స్వాధీనం చేసుకున్నారనీ వార్తలు వెలువడ్డాయి. అయితే అవెన్ని? ఎక్కడున్నాయి? వాటిలో ఏముంది.. అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.  
 

మరిన్ని వార్తలు