రైస్‌ మిల్లుల్లో ఎఫ్‌సీఐ తనిఖీలు ఆపాలి: మంత్రి గంగుల

3 May, 2022 15:09 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: రైస్‌ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాల తీరుపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) చేస్తున్న దాడులపై తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గుంగుల కమలాకర్‌ స్పందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఎఫ్‌సీఐ తనిఖీల వెనుక కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమేమిటని ప్రశ్నించారు. రైతుల సజావుగా ధాన్యం అమ్ముకోకుండా చేసే కుట్రలో భాగంగానే ఎఫ్‌సీఐ దాడులంటూ మండిపడ్డారు.

ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణలో కొనుగోళ్లు ప్రారంభం కాగానే దాడులు చేస్తున్నారు. రైస్ మిల్లులలో ఉద్దేశ్య పూర్వకంగానే ఎఫ్‌సీఐ తనిఖీలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై దాడి చేయాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొనుగోళ్లు సంజావుగా సాగకూడదని కేంద్రం భావిస్తోంది. రైతులు పండించిన పంట రైస్ మిల్లుల వరకూ చేరకూడదని డబ్బులు అందకుండా చేయాలని కేంద్రం ఉద్దేశ్య పూర్వకంగానే తనిఖీలు చేయిస్తోంది. దానివల్ల రైతులు ఇబ్బందులు పడుతారు. వడ్లు మాయం కావు.. కొనుగోళ్లు పూర్తి అయ్యాక ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని కేంద్రానికి విన్నవిస్తున్నాం.

చదవండి: (అక్రమాలపై ఎఫ్‌సీ‘ఐ’)

కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ రైస్ మిల్లులలో ఎఫ్‌సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలి. కేంద్రానికి అధికారం ఉంది.. మేము వ్యతిరేకించడం లేదు అయితే ఇప్పుడిప్పుడే కోతలు పూర్తయ్యి ధాన్యం వస్తోంది. కాబట్టి ఇది సమయం, సందర్భం కాదు. దీనివల్ల ధాన్యం సేకరణ ఆగిపోతుంది.. రైతులకు ఇబ్బందులు కలుగుతాయి. ధాన్యం సేకరణ పూర్తయ్యాక తనిఖీలు చేస్తే సహకరిస్తామని' తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. 

చదవండి: (4.54 లక్షల బస్తాలు మాయం)

మరిన్ని వార్తలు