నిరంతరం ధాన్యం కొనుగోళ్లు 

25 May, 2022 01:53 IST|Sakshi

30 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించామన్న మంత్రి గంగుల

జూన్‌ 10లోపు కొనుగోళ్లు పూర్తవుతాయన్న మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆటంకం లేకుండా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొ న్నారు. మొన్నటి అకాల వర్షాలకు తడిసిన 10 వేల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశా మని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయినపక్షంలో ఆరబెట్టి తీసుకొస్తే కొనుగోలు చేస్తా మని రైతులకు భరోసా ఇచ్చి, ప్రతి ధాన్యం గింజను కొన్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

‘ధాన్యం కొనుగోళ్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై పడే రూ.3 వేల కోట్లకు పైగా భారాన్ని భరిస్తూ సీఎం కేసీఆర్‌ ధాన్యం సేకరణ చేయిస్తున్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో రూ.5,888 వేల కోట్ల విలువైన 30.09 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని, 4.72 లక్షల మంది రైతుల నుండి సేకరించాం..’అని గంగుల వివరించారు.  

కేంద్రం సహకరించకున్నా.. 
‘కొనుగోళ్లు జరుగుతున్నప్పుడే ప్రత్యక్ష తనిఖీల పేరుతో కేంద్రం ఇబ్బందులు పెడుతున్న విష యాన్ని రైతులు గమనిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మే 2 వరకు ఒక్క గన్నీ బ్యాగును రాష్ట్రానికి అందించకున్నా ధాన్యం సేకరణ ఆగలేదు. 6,544 కొనుగోలు కేంద్రాలకు గానూ 500 కేంద్రాల్లో విజయవంతంగా ధాన్యం సేకరణ పూర్తయింది. రోజుకు  లక్షన్నర నుంచి రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ చేస్తున్నాం.

11.64 కోట్ల గన్నీ బ్యాగుల్ని సేకరించాం. వీటిలో 7.52 కోట్ల సంచులు వాడగా, ఇంకా 4.12 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరో 16 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు ఈ బ్యాగులు సరిపోతాయి. మార్కెట్లకు వచ్చిన ధాన్యాన్ని పూర్తిగా సేకరిస్తాం. ఈ ప్రక్రియ నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం  జిల్లాలలో మరో వారం రోజుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 10వ తారీఖు వరకు పూర్తవుతుంది’ అని  ఆశాభావం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు