పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయం: గంగుల కమలాకర్‌

13 Apr, 2022 20:35 IST|Sakshi
(ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లకు సివిల్‌ సప్లై సన్నద్ధమైందని మంత్రి కమలాకర్‌ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రేపటి(గురువారం) నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతాయిని తెలిపారు. ఎల్లుండి నుంచి పూర్తిస్థాయి కొనుగోళ్లు మొదలవుతాయని చెప్పారు. మే చివరి నాటికి పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేస్తామని తెలిపారు. తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

తెలంగాణలో పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయమని చెప్పారు. ఆధార్ కార్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రైతు అని నిర్ధారించుకోవడానికే ఈ సిస్టం ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. పక్కనున్న రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బందుల కారణంగా ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి అమ్ముతారనే సమాచారం ఉందని తెలిపారు.

ఇందుకోసం తెలంగాణలో 51 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మిల్లర్లకు ధాన్యం చేరిన తర్వాత ప్రభుత్వానికి మెసేజ్ రాగానే మూడు రోజుల్లోనే రైతులకు డబ్బు జమ అవుతుందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. యాసంగిలో 36 లక్షల వరి సాగు అయ్యిందని తెలిపారు.

మరిన్ని వార్తలు