సాక్షి, కరీంనగర్: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలో పర్యటన సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో మంత్రి కాలికి స్వల్ప గాయమైంది.
వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలోని చర్ల బూత్కూరులో మంత్రి గంగుల కమలాకర్ కార్యక్రమానికి హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ వేదికపై నుంచి గంగుల కింద పడిపోయారు. ఎక్కువ మంది రావడం వల్ల సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మంత్రి సహా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ఓ జడ్పీటీసీ సభ్యుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి కమలాకర్ మీడియాతో మాట్లాడారు. సభావేదిక కూలిన ఘటనలో స్వల్ప గాయాలయ్యాయని, డాక్టర్లు చికిత్స చేశారని, విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని వెల్లడించారు. అనంతరం.. మంత్రి గంగుల కమలాకర్‌ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తోపాటు మేయర్ సునీల్ రావు పరామర్శించారు.