మరింత ఈజీ: వాట్సాప్‌లో గ్యాస్‌ ఇలా బుక్‌ చేసుకోండి

14 Apr, 2021 14:16 IST|Sakshi

ఇక గ్యాస్‌ సిలిండర్‌ వాట్సాప్‌ ద్వారా బుకింగ్‌  

ఖైరతాబాద్‌లో లక్ష మందికి ప్రయోజనం 

బుకింగ్‌ సమస్యల నుంచి ఊరట 

బంజారాహిల్స్‌/ హైదరాబాద్‌: గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకోవడంలో వినియోగదారులకు మరింత ఉపయోగపడే రీతిలో సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీలు సులభతరం చేశాయి. ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులు ఇప్పుడు వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. గతేడాది గ్యాస్‌ కంపెనీలు తమ వినియోగదారుల సౌలభ్యం కోసం వివిధ ఆన్‌లైన్‌ ప్రక్రియలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. గ్యాస్‌ ఏజెన్సీ వద్ద, డీలర్‌ను సంప్రదించడం లేదా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకునే అవకాశం ఇప్పటిదాకా ఉండేది. ఇక నుంచి వాట్సాప్‌ ద్వారా కూడా గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.  

ఎలా బుక్‌ చేసుకోవాలి... 
ఇండెన్‌ కస్టమర్లు 7718955555కు కాల్‌ చేసి ఎల్పీజీ సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో అయితే 7588888824కు సందేశం పంపించవచ్చు. 
హెచ్‌పీ గ్యాస్‌ కస్టమర్లు 9222201122కు వాట్సాప్‌ మెసేజ్‌ పంపడం ద్వారా సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ నంబర్‌ మరిన్ని సేవా వివరాలను కూడా అందజేస్తుంది. 
భారత్‌ కస్టమర్లు సిలిండర్లను బుక్‌ చేసుకోవాలంటే తమ రిజిస్టర్‌ మొబైల్‌ నుంచి 1800224344 నంబర్‌కు మెసేజ్‌ చేయాలి. దీని తర్వాత వినియోగదారుల బుకింగ్‌ అభ్యర్థనను గ్యాస్‌ ఏజెన్సీ అంగీకరిస్తుంది. 
బుకింగ్‌ సమయంలో వినియోగదారులు తప్పనిసరిగా తమ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి మాత్రమే వాట్సాప్‌ పంపాలి.  

మరింత సులభం..  
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల పరిధిలో గల 8 గ్యాస్‌ ఏజెన్సీల వినియోగదారులకు ఈ వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం లభించింది. సుమారు లక్ష మందికి మేలు చేకూరనుంది. వాట్సాప్‌ ద్వారా బుకింగ్‌ సౌకర్యం కల్పించడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఎంతో ఉపయోగకరం 
వాట్సాప్‌ ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే సౌలభ్యం వినియోగదారులకు ఎంతగానో దోహదపడుతుంది. సామాన్య మధ్య తరగతి ప్రజలకు కూడా ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉండటం, వాట్సాప్‌ వాడుతుండటంతో ఈ ప్రక్రియ వారికి బాగా దోహదపడుతుంది. ఇప్పటి వరకు ఉన్న పలు విధానాల ద్వారా కొంత ఇబ్బంది కలిగేది. ఇప్పుడు తేలికగా గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చు. 
– బి.శ్రీనివాస్, బీఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌  

మరిన్ని వార్తలు