Be Alert: నిర్లక్ష్యం చేస్తే గ్యాస్‌..‘బాంబే’.. కిటికీలు తెరిచి ఉన్నా బయటకు పోదు!

5 Sep, 2022 09:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చందానగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని లింగంపల్లి రైల్వే విహార్‌ కాలనీలో గురువారం జరిగిన దుర్ఘటనలో ఒకరు చనిపోగా ఇద్దరు క్షతగాత్రులయ్యారు.రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని నల్లగుట్ట జే లైన్‌లో చోటు చేసుకున్న ఉదంతంలో భార్యభర్తలకు గాయపడ్డారు.

.ప్రతి వంటింట్లోనూ ఉండే ఎల్పీజీ గ్యాస్‌ లీకేజ్‌ వల్ల జరిగిన పేలుడు ప్రభావాలివి. గత వారం జరిగిన రెండే కాదు.. నగరంలో తరచుగా ఇలాంటి ‘గ్యాస్‌’ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏటా పదుల సంఖ్యలో ఉంటున్న వీటి వల్ల ప్రాణనష్టం తక్కువగా ఉంటున్నా..ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉంటోంది. అవగాహన లేమి, నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. గ్యాస్‌ సిలిండర్‌లో దాదాపు 14.5 కేజీల బ్యూటేన్, ప్రొఫైన్‌ వాయువులను అత్యధిక ఒత్తిడితో ద్రవ రూపంలో నిక్షిప్తం చేస్తారు. ఈ బండ వినియోగంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, అవగాహన కొరవడిగా సంభవించే ప్రమాదం బాంబు పేలుడుతో సమానం. సాధారణంగా స్టౌవ్‌ ఆఫ్‌ చేసి ఉన్నప్పటికీ..గ్యాస్‌ లీకేజ్‌ అనేది సున్నిత ప్రాంతాల నుంచి జరిగే అవకాశం ఉంది.

►సిలిండర్,  స్టవ్‌లను కలుపుతూ రబ్బర్‌ ట్యూబ్‌ ఉంటుంది. ఇది అటు సిలిండర్‌కు, ఇటు  స్టవ్‌కు అతికే ప్రాంతాల్లో ఏదో ఒక చోట నుంచి లీక్‌ అయ్యే ప్రమాదం ఉంది. 

►సాధారణంగా స్టవ్‌కు అనుసంధానిచే చోటే వేడి వల్ల ఈ ట్యూబ్‌ సాగే గుణం కోల్పోతుంది. ఫలితంగా పెళుసుదనం సంతరించుకుని పగుళ్లు ఏర్పడతాయి. కేవలం గుండు సూది మొనంత రంధ్రం ఏర్పడితే చాలు. దీని లోంచి గంటకు ముప్పావు నుంచి కేజీన్నర వరకు గ్యాస్‌ లీక్‌ అవుతుంది.  
చదవండి: సికింద్రాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌లో పేలుడు..

►స్టవ్‌కు ఉండే నాబ్స్, రెండు నాబ్స్‌నూ కలిపే పైప్, కొత్త సిలిండర్‌ బిగించే సమయంలో రెగ్యులేటర్, సిలిండర్‌ నాబ్‌ల నుంచీ లీక్‌ అయ్యే అవకాశం ఉంది. నానక్‌రామ్‌గూడ ఉదంతంలో మాత్రం కమర్షియల్‌ సిలిండర్‌ నుంచి అనేక కనెక్షన్లు ఇచ్చిన వాల్వ్‌ లీకేజ్‌కి కారణమైంది.  

►వంటింటికి కిటికీలు, వెంటిలేటర్లు ఉంటే లీకైన గ్యాస్‌ వాటి నుంచి బయటకు వెళ్లిపోతుందనే భావన చాలా మందికి ఉంటుంది. వంట గ్యాస్‌లో ఉండే వాయువులు గాలి కన్నా చాలా బరువైనవి. అందుకే లీకైన తరవాత నేలపైకి చేరతాయి. నాలుగడుగుల కంటే తక్కువ ఎత్తులోనే వ్యాపిస్తాయి. దీంతో కిటికీలు తెరిచి ఉన్నా... వెంటిలేటర్లు ఉన్నా వాటి ద్వారా బయటకు పోయే అవకాశం ఉండదు.  

►ఇంట్లో వ్యాపించి ఉన్న గ్యాస్‌కు ప్రేరణ లభించగానే ఒక్కసారిగా అంటుకుటుంది. ఇలా అంటుకున్న సందర్భంలో విస్తరించి ఉన్న గ్యాస్‌ 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది. అంటే కేజీ గ్యాస్‌ లీకై ఉంటే... మంట అంటుకున్న వెంటనే అది 12 వేల కేజీల వరకు వ్యాకోచిస్తుంది. ఫలితంగానే గ్యాస్‌ ప్రమాదం చోటు చేసుకున్న చోట భారీ ఆస్తి నష్టం ఏర్పడుతుంది.  

►సమీపంలో ఉన్న వ్యక్తులు మాత్రం ప్రాణాలు కోల్పోవడమో, 60 శాతం వరకు కాలిపోవడమో జరుగుతుంది. అనేక ప్రమాదాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ఏమాత్రం చెక్కు చెదరదు. దీన్ని చూసి అనేక మంది గ్యాస్‌ వల్ల జరిగిన పేలుడు కాదని భావిస్తారు. ఇలాంటి బ్లాస్ట్‌ల్ని కెమికల్‌ ఎక్స్‌ప్లోజన్‌ అని, సిలిండర్‌ కూడా ఛిద్రం అయిపోతే దాన్ని మెకానికల్‌ ఎక్స్‌ప్లోజన్‌ అని అంటారు. 

►గత వారం జరిగిన వాటిలో చందానగర్‌ పరిధిలోని మొదటి ప్రమాదానికి గ్యాస్‌ లీకైన గదిలో లైట్‌ వేయడం కారణమైతే, రామ్‌గోపాల్‌పేట పరిధిలో జరిగిన రెండో దానికి స్టవ్‌ వెలిగించే ప్రయత్నం చేయడం కారణమైంది. 
చదవండి: ఆ ఆశతో గణేష్ లడ్డూను దొంగిలించిన పిల్లలు

ఇద్దరి పరిస్థితి విషమం 
రాంగోపాల్‌పేట్‌:  రాంగోపాల్‌పేట్‌ డివిజన్‌లోని నల్లగుట్ట జే లైన్‌లో శనివారం గ్యాస్‌ లీకై జరిగిన పేలుడులో గాయపడిన దంపతులు సందీప్, అనుల  పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వీరిని పోలీసులు  సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స ప్రారంభించారు. 55 శాతం కాలిన గాయాలతో ఇద్దరు చికిత్స పొందుతుండగా పరిస్థితి మాత్రం విషమంగానే ఉందని గాం«ధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 

మరిన్ని వార్తలు